హుజూర్‌న‌గ‌ర్ ఫ‌లితం ఏం చెప్ప‌బోతోంది..?

November 12, 2019

తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రాన్ని హుజూర్‌న‌గ‌ర్ ఫ‌లితం మార్చ‌బోతోందా..?  అధికార టీఆర్ఎస్‌, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీల భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుందా..?  మొత్తంగా తెలంగాణ రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుందా..? అంటే రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం ఔన‌నే అంటున్నారు. ఫ‌లితం ఎవ‌రి ప‌క్షాన ఉన్నా.. రాజ‌కీయ ప‌రిణామాలు మాత్రం వేగంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ నెల 21న‌ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. ఈ నెల 24 ఫ‌లితం వెలువ‌డ నుంది.
ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు సామాన్య జ‌నం కూడా తీవ్ర ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఫ‌లితం ఎలా ఉండ‌బోతుందోన‌ని ఊపిరిబిగ‌బ‌ట్టుకుని ఉంటున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో ఫ‌లితం త‌మ‌కే అనుకూలంగా వ‌స్తుంద‌ని ఆయా పార్టీలు మాత్రం ధీమాగా ఉన్నాయి.  అయితే.. పోలింగ్ ముగిసిన త‌ర్వాత వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఈసారి గులాబీ విజ‌యం ఖాయ‌మ‌ని చెబుతున్నాయి. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోక‌త‌ప్ప‌ద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.
2018లో వ‌చ్చిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డిపై స్వ‌ల్ప మెజార్టీతో విజ‌యం సాధించడం.. ఆ త‌ర్వాత వ‌చ్చిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ న‌ల్ల‌గొండ ఎంపీగా గెల‌వ‌డం.. హుజూర్‌న‌గ‌ర్ స్థానం ఖాళీ కావ‌డం.. ఇప్పుడు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిరెడ్డి బ‌రిలో ఉండ‌డం తెలిసిందే. ఇక టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డికే మ‌ళ్లీ సీఎం కేసీఆర్ అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు హుజూర్‌న‌గ‌ర్ లో టీఆర్ఎస్ గెల‌వ‌లేదు. ఈసారి ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో గులాబీ పార్టీ ప‌నిచేసింది. ఇక ఇదే స‌మ‌యంలో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవ‌డానికి గ‌ట్టిగానే ప్ర‌య‌త్నం చేసింది.
ఫ‌లితం అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ‌స్తే.. ఇక ప్ర‌జా మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌న్న విష‌యాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్తుంద‌ని, ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ మ‌రింత దూకుడుగా.. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆర్టీసీ విష‌యంలో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒక‌వేళ ఫ‌లితం ప్ర‌తికూలంగా వ‌స్తే మాత్రం.. ఇక అధికార టీఆర్ఎస్ ప‌త‌నాన్ని ఎవ‌రూ కాపాడ‌లేర‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.
ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన పార్ల‌మెంట్‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. మ‌రోవైపు.. ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితు మ‌రింత ద‌య‌నీయంగా మారుతుంద‌ని, దీంతో ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా త‌మ‌దారి తాము చూసుకుంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ ఫ‌లితం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా నాలుగు స్థానాల‌ను ద‌క్కించుకున్న క‌మ‌ల‌ద‌ళం.. ఈ హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో స‌త్తాచాటాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేసింది. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నోటాకంటే.. త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి. ఆ పార్టీ అభ్య‌ర్థికి కేవ‌లం 1555 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.
ఈ ఉప ఎన్నిక‌లో ఓట్ల సంఖ్య‌ను పెంచుకుంటే మాత్రం క‌మ‌ల‌ద‌ళం మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. అదేవిధంగా.. ఈ ఎన్నిక‌లో టీడీపీ కూడా పోటీలో ఉంది. తెలంగాణ‌లో టీడీపీకి పూర్వ‌వైభ‌వం తీసుకురావాల‌ని ఎన్నిక‌ల‌కు ముందు ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. ఒక‌వేళ‌.. భారీ సంఖ్య‌లో ఓట్లు వ‌స్తేమాత్రం ఆ పార్టీ కూడా ఇక పున‌ర్నిర్మాణంపై దృష్టిపెడుతుంది. ఇక ఫ‌లితం వ‌చ్చేదాకా ఆగాల్సిందే మ‌రి.