వేకువజామున.. హైదరాబాద్ ఉలిక్కిపడింది

August 12, 2020

గడిచిన కొన్ని వారాలుగా ఎవరికి వారు ఇళ్లల్లోనే ఉండిపోతున్న పరిస్థితి. వ్యాపార.. వాణిజ్య సంస్థలతో పాటు.. చాలా వరకూ ఫ్యాక్టరీలు.. కర్మాగారాలు.. ఇతర వాణిజ్య ప్రాంతాలు మొత్తం బంద్ అయిపోయాయి. ఇలాంటివేళలో చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

గడిచిన నాలుగైదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రమాదాలు చోటు చేసుకోవటం తెలిసిందే.
హైదరాబాద్ నడిబొడ్డు లాంటి నాంపల్లిలో సోమవారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో ఉలిక్కిపడింది. రాయల్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి తోడు గోదాంలో ఉన్న కంప్రెసర్ సిలిండర్ పేలింది. భారీ శబ్దంతో పాటు.. మంటలు పెద్ద ఎత్తున ఎగిశాయి. దీంతో.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం (మే 7న) సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండల పరిధిలోని పారిశ్రామికవాడలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే.. ఆదివారం రాత్రి ఏపీలోని నెల్లూరు జిల్లాలో కూడా భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

వేసవిలో అగ్నిప్రమాదాలు మామూలే అయినా.. మొత్తం కట్టేసుకొని కూర్చున్న వేళ.. అగ్నిప్రమాదాలుచోటు చేసుకోవటం.. ఇంతకాలం లేని ప్రమాదాలు ఇప్పుడే చోటు చేసుకోవటం ఏమిటన్న ప్రశ్న మనసులోకి రాక మానదు. ఇంతకూ కారణమై ఏమై ఉంటుందంటారు?