అయ్యో పాపం హైదరాబాదు... !

August 10, 2020

ప్రపంచీకరణ గ్రామీణ భారతంలో అవాంఛనీయ మార్పులను తెచ్చింది. టెక్నాలజీని ప్రపంచాన్ని అరచేతిలో పెట్టింది గాని... మనసుల్లో మానవత్వాన్ని, ఒకరికొకరు నిలబడే గుణాన్నీ తీసేసింది. అంతేకాదు, నీలాంటోడు ఇక్కడుండటం ఏంటి పదపోదాం నగరాలకు అంటూ ఊళ్లను ఖాళీ చేసింది. 2010 తర్వాత చదువుకోవాలనుకునేవాడు, చదువు పూర్తయినవాడు ఇద్దరు పల్లెను వదిలేశారు. పట్నం బాట పట్టారు. చదువుకున్న వాడికి నగరంలో మాత్రమే ఉపాధి అంటూ అతన్ని పరాన్నజీవిని చేసింది ప్రపంచీకరణ. 

కానీ 2020 కరోనా తో పాటు అనేక మార్పులను మోసుకొచ్చింది. కాలుష్యంలో ట్రాఫిక్ లో ఇరుక్కున్న నగరాలను ఖాళీ చేసింది. ప్లాస్టిక్ మయమైన దేశాన్ని రాగి, పేపరు, గుడ్డల వైపు మళ్లించింది. చివరకు మన దగ్గరే అద్భుతం ఉంది, మన ఊర్లోనే భద్రత ఉంది అనిపించింది. జీవం కోల్పోయిన పల్లెలు ఇపుడు కళకళలాడుతున్నాయి. ముసలివాళ్లతో నిండిపోయిన ఊళ్లో ఇపుడు యువతరం తచ్చాడుతోంది. అంతా కరోనా పుణ్యం. 

నగరానికి జ్జానోదయం అయ్యింది. రాకెట్ లా దూసుకుపోయిన మహానగరాల రియల్ ఎస్టేట్ నేల చూపులు చూడటం మొదలుపెట్టింది.  అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని మెల్లగా దూసుకుపోతున్న హైదరాబాదు ఒక్కసారి కరోనాతో కుదేలైంది. ఎక్కడ చూసినా నగరంలో టులెట్ బోర్డులు. శివారులో  కట్టిన ఆఫీసులో అద్దెకు ఉండేవాడు లేడు. కడుతున్న ఇంటిని కొనేవాడు లేడు. 2018-19లో ఒక ఊపు ఊపిన రియల్ఎస్టేట్ చల్లబడిపోయింది. ఇండియాలోని అన్ని నగరాల్లో ఇళ్లకు గిరాకీ 79 శాతం పడిపోయిందని ఒక నివేదిక తెలిపింది. ఎంత దారుణంగా డిమాండ్ తగ్గిందో చూడండి. హైదరాబాదులో ఒక్కటే తీసుకుంటే అది మరింత దారుణంగా 86 శాతం (జూన్ త్రైమాసికం) పడింది... అంటే గత ఏడాది 100 ఇళ్లకు డిమాండ్ ఉంటే ఈ ఏడాది కేవలం 14 ఇళ్లే అమ్ముడుపోయాయన్నమాట. సరే లాక్ డౌన్ వల్ల అనుకుంటున్నారేమో. 

జవనరి - మార్చి  త్రైమాసికంలో 62 శాతం తగ్గింది. పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది దీనివల్ల. ఇపుడే ఇలా ఉంటే అన్ని రంగాల్లో ఆర్థిక మాంద్యం ప్రభావం పడింది... ఇది నానాటికీ దారుణంగా మారిపోతోంది. ఈ క్రమంలో  హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఎప్పటికి కోలుకుంటుందో ఏమో.

రియల్ ఎస్టేట్ సంగతి అలా ఉంచితే... అద్దె ఇళ్ల ఓనర్లు విలవిల్లాడుతున్నారు. ఎవరూ అద్దెకు రావడం లేదు. నగరంలోని పలు ప్రాంతాల్లో నెల రెంటు ఫ్రీ అన్నా ఎవరూ రాని పరిస్థితి. ఇది ఎక్కువగా మాదాపూర్ లో కనిపిస్తుంది. వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రం హోమే ఉంటే... ఇక అద్దెఇళ్లతో పనేముంటుంది? ఎలాంటి హైదరాబాదు ఎలా అయ్యిందో పాపం. 

Read Also

కరోనా విళయ తాండవం!!
’’జగన్ మాట విన్నారు... బుక్కైపోయారు !!‘‘
విజయవాడ టాప్ అంటే ఎందులోనో అనుకున్నా.. అబ్బా..!!