హైదరాబాదు ఎన్నడూ చూడని వర్షమిది

August 03, 2020

హైదరాబాదులో మహావర్షం పడుతోంది. తెరపి లేకుండా కుండపోత అంటే ఎలా ఉంటుందో వరుసగా మూడు రోజుల నుంచి రుచిచూపిస్తున్న వరుణుడు రోజు గత నాలుగు గంటలుగా కుండపోత వర్షాన్ని కురిపిస్తున్నాడు. రోడ్లు కాలువలు అయ్యాయి. అక్కడ ఇక్కడ అనే తేడాలేకుండా లోతట్టు ప్రాంతాలన్నీమునిగిపోయాయి. జనజీవనం స్తంభించింది. కొన్ని వందల మంది రోడ్ల మీద గుంతల్లో పడి గాయాలపాలయ్యారు. రవాణా పూర్తిగా స్తంభించింది.

గుంతలపై అడుగు కంటే ఎక్కువ ఎత్తులో నీరు పారుతుండటంతో కార్లు వెళ్లలేకపోతున్నాయి. ధైర్యం చేసి వెళ్తే కార్ల సెలైన్సర్లలోకి, కారులోకి నీరు పోయి ఒక్కో వాహనదారులకు వేలల్లో నష్టం వాటిల్లుతోంది. గత దశాబ్దకాలంగా ఎన్నో వానలు వచ్చినా... ఇలా మూడు రోజుల పాటు కుండపోత వాన ఎపుడూ పడలేదు. 

ఇళ్లలోనే కాకుండా ప్రభుత్వ ఆఫీసులు, పోలీసు స్టేషన్లు కూడా మునిగిపోయాయి. నాచారం పోలీసు స్టేషను, పంజాగుట్ట పోలీసు స్టేషనుతో పాటు చాలా ష్టేషన్లలో నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలనే కాదు... సాధారణ లెవెల్ లో  ఉన్న ప్రాంతాల్లోనూ వరద ముంచెత్తింది. 

చాలాచోట్ల కిలోమీటరు ప్రయాణానికి అరగంట నుంచి గంట సమయం పడుతున్న దుస్థితి. దీంతో ఇళ్లకు ఎలా చేరాలో తెలియక జనం గగ్గోలు పెడుతున్నారు. షాకింగ్ ఏంటంటే.. 40 నిమిషాల నుంచి సాంకేతిక కారణాల వల్ల మెట్రో రైలు సర్వీసులు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు షాక్ కు గురయ్యారు.

మొన్న 20 ఏళ్ల అమ్మాయి వానలకు మెట్రో పెచ్చులూడి చనిపోగా, నిన్న ఓ యువకుడు మ్యాన్ హోల్ లో పడి చనిపోయాడు. సుమారు 15 సెంటీ మీటర్ల వర్షంతో హైదరాబాదు విలవిల్లాడుతోంది.