లండ‌న్ లో హైద‌రాబాదీ దారుణ‌హ‌త్య‌!

August 07, 2020

లండ‌న్ లో హైద‌రాబాదీ ఒక‌రు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని డ‌బీర్ పురా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల న‌దీముద్దీన్ లండ‌న్ లోని వెల్లింగ్ట‌న్ స్ట్రీట్ లోని టెస్కో సూప‌ర్ మార్కెట్ లో ప‌ని చేస్తుంటారు. తాజాగా ఆయ‌న‌.. అదే సంస్థ పార్కింగ్ లాట్ లో క‌త్తిపోట్ల‌కు గురై హ‌త్య‌కు గురికావ‌టం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.
ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఉన్న వారే హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 2012లో హైద‌రాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసిన న‌దీమ్.. ఉపాధి కోసం లండ‌న్ వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. కొద్ది రోజుల‌కే త‌న త‌ల్లిదండ్రుల్ని లండ‌న్ కు తీసుకెళ్లారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌ర్మ‌నెంట్ రెసిడెన్సీ హోదా ల‌భించింది. కొద్ది రోజుల్లో బ్రిట‌న్ పౌర‌స‌త్వం ల‌భించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయిన వేళ‌.. ఆయ‌న హ‌త్య‌కు గురి అయ్యారు.
న‌దీమ్ ను హ‌త్య చేసింది అదే సూప‌ర్ మార్కెట్ లో ప‌ని చేస్తున్న ఒక పాకిస్థానీగా అనుమానిస్తున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. స‌ద‌రు నిందితుడు ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ విష‌యం అధికారికంగా వెల్ల‌డి కాలేదు. ఇదిలా ఉండ‌గా.. కొద్ది నెల‌ల క్రితం హైద‌రాబాద్ కు చెందిన డాక్ట‌ర్ తో న‌దీమ్ వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భిణి. భ‌ర్త హ‌త్య‌కు గుర‌య్యార‌న్న స‌మాచారంతో తీవ్ర‌మైన షాక్ కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం వైద్యులు ఆమెకు సైకాల‌జిక‌ల్ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ఉద్యోగానికి వెళ్లిన న‌దీమ్ తిరిగి రాక‌పోవ‌టంతో.. అనుమానంతో పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. గాలింపులు జ‌రుపుతున్న పోలీసుల‌కు.. న‌దీమ్ ప‌ని చేస్తున్న సూప‌ర్ మార్కెట్ పార్కింగ్ లాట్ తో క‌త్తిపోట్ల‌తో తీవ్ర ర‌క్త‌స్రావ‌మైన ప‌రిస్థితుల్లో క‌నిపించారు. అత‌డి ప్రాణాలు అప్ప‌టికే పోయిన‌ట్లుగా తెలుస్తోంది. అత‌డి మృత‌దేహానికి లండ‌న్ లోనే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. కొద్దిమంది బంధువులు హైద‌రాబాద్ నుంచి లండ‌న్ ప‌య‌న‌మ‌య్యారు. న‌దీమ్ హ‌త్య వార్త విన్నంత‌నే అత‌గాడు నివ‌సించిన ప్రాంత‌మైన డ‌బీర్ పురాలో విషాదం నెల‌కొంది.