నా టార్గెట్ ఎప్పుడూ సిక్స‌రే- విజ‌య్ దేవ‌ర‌కొండ‌

August 14, 2020

సినిమాకు అంతిమంగా ఏ ఫ‌లితం వ‌చ్చినా.. తాను మాత్రం పెద్ద విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నాడు. ఈ విష‌యాన్ని అత‌ను క్రికెట్ భాష‌లో చెప్పుకొచ్చాడు. ప్ర‌తి బంతికీ సిక్స‌ర్ బాదాల‌నే చూస్తాన‌ని.. కానీ అది స్టాండ్స్‌లో ప‌డుతుందా.. లేక మ‌ధ్య‌లో క్యాచ్ అవుతుందా అన్న‌ది మాత్రం చెప్ప‌లేన‌ని అన్నాడు. త‌న సినిమాలు చూసేందుకు థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఏదో ఒక కొత్త‌ద‌నం మాత్రం అందిస్తాన‌ని అత‌ను ధీమా వ్య‌క్తం చేశాడు. తన కొత్త సినిమా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో విజ‌య్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. త‌న ప్ర‌సంగంలో విజ‌య్ ఇంకా ఏమ‌న్నాడంటే..
''నాలుగేళ్ల క్రితం 2016లో 'పెళ్ళిచూపులు' అనే సినిమాతో తొలిసారి ఒక లీడ్ యాక్టర్‌గా మీ ముందుకు వచ్చా. ఇప్పటికే ఏడు సినిమాలు రిలీజయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలోచాలా చేశాం.. ఈ జర్నీలో రెండే రెండు స్థిరమైనవి ఉన్నాయ్. ఒకటి - మీరు (ఫ్యాన్స్). విజయ్ అంటే ఎవ్వడికీ తెల్వదు. అట్లాంటిది 2016 నుంచి ఇప్పుడు 2020 వరకు మీరు నాతోడు వస్తూనే ఉన్నారు. మనం కలిసి ఇంకా చాలా చాలా చెయ్యబోతున్నాం. ఇది ఆరంభం మాత్ర‌మే. ఈ సంవత్సరం నుంచి కొత్త దశలోకి ఎంటరవుతున్నాం. రెండోది - నేను సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్, డబుల్ అనేది నాకు ఓపిక లేదు. కొడితే స్టేడియం బయటకు కొట్టాలని బ్యాట్ ఊపుతా. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' చేసిన. తమిళ్ రాకున్నా నేర్చుకొని, 'నోటా' చేసిన. 'డియర్ కామ్రేడ్' సినిమాను ఐదు రాష్ట్రాల్లో రిలీజ్ చెయ్యాలని నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ, నేర్చుకున్నాం. ఊరూరూ తిరిగి మ్యూజిక్ కాన్సర్ట్స్ చేశాం. నేను కొట్టిన బంతులు కొన్ని స్టేడియం బయట పడ్డాయి, కొన్ని బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ లు పడ్డాయి. కానీ భయమైతే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా.  ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని మొన్న చెప్పినా. ఎందుకంటే నాకట్లా అనిపిస్తోంది. అంటే మనిషిలా మారుతున్నా. టేస్టులు మారుతున్నయి. సినిమాల్లో ఇంకో దశలోకి వెళ్తున్నా.   లాస్ట్ లవ్ స్టోరీ చేసినప్పుడు అన్నీ కవర్ చెయ్యాలని మూడు రకాల మనుషుల్ని నా పాత్రలో ప్లే చేశా. మూణ్నాలుగు విచిత్రమైన క్యారెక్టర్లు ఈ సినిమాలో చేసే స్క్రిప్టుతో క్రాంతిమాధవ్ నా దగ్గరకు వచ్చాడు. స్క్రిప్ట్ వినగానే ఇది నా ఫైనల్ లవ్ స్టోరీ అని ఫిక్సయి చేశా. ఇలాంటి క్యారెక్టర్ చేసే ఛాన్స్ నాకు మళ్లీ దొరకదు'' అని విజ‌య్ చెప్పాడు.