గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా? !

August 13, 2020

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదన్నారు. అందుకే మూడు రాజధానులను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేస్తే తెలంగాణలో వచ్చినట్లు అసమానతలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. 

ఇది నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని... తన పదవికి రాజీనామా చేసి గన్నవరం ఉప ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అన్నారు. ఈ  విషయం ముఖ్యమంత్రి జగన్ కు కూడా చెప్పినట్లు సంచలన విషయం వెల్లడించారు. కరోనా కారణంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆగానని అన్నారు. 

మూడు రాజధానుల కోసం అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. రాజధాని తరలింపు వల్ల తన ప్రాంత రైతులు కొంత నష్టపోయారు. అయినా నేను ఎన్నికలకు వెళ్తాను. ఉప ఎన్నిక ఫలితాన్ని రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయంగా చూడటానికి నేను రెడీగా ఉన్నాను. గన్నవరం ఎన్నికను రాజధాని మార్పుతో ముడి పెట్టాలా వద్దా అనేది టీడీపీ తేల్చుకోవాలి.  ఎన్నికలు జరుగుతాయంటే ఇప్పుడే రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.