ఎంత ఏడ్చానో.. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో

May 26, 2020

ఒక మంచి సినిమా చేసి.. అది వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే.. ఎంతకీ విడుదలకు నోచుకోకుండా ఆగిపోతే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. అందులోనూ ఒక సినిమా మీద ఆ హీరో కెరీర్ ఆధార పడి ఉన్నపుడు ఇలాంటి ఇబ్బందులు తలెత్తితే తట్టుకోవడం కష్టమే అవుతుంది. యువ కథానాయకుడు నిఖిల్ పరిస్థితి ఇదే. ‘కిరాక్ పార్టీ’తో షాక్ తిన్న నిఖిల్‌ ‘అర్జున్ సురవరం’ మీద చాలా ఆశలతో ఉండగా.. గత ఏడాదే విడుదల కావాల్సిన సినిమా అనివార్య కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. చివరగా మే 1కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి నిఖిల్ ప్రమోషన్లు గట్టిగా చేశాక సినిమా వాయిదా అనే వార్త తెలిసి తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ఈ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. మధ్యలో సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ ఎప్పుడంటూ అభిమానులు వేసే ప్రశ్నలతో అతను సతమతం అయ్యాడు.

తన కెరీర్లో ఈ సినిమా వల్ల పడ్డ బాధ, అనుభవించిన యాతన మరే సినిమాకూ లేదని అంటున్నాడు నిఖిల్. మళ్లీ మళ్లీ ‘అర్జున్ సురవరం’ వాయిదా పడటం వల్ల తన హృదయం ముక్కలైందని నిఖిల్ చెప్పాడు. దీని వల్ల తాను ఎంత ఏడ్చానో.. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో చెప్పలేనని.. ఒక మంచి సినిమాకు ఇలా జరగడం తనను చాలా బాధ పెట్టిందని నిఖిల్ చెప్పాడు. ఈ సినిమాకు బిజినెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవని.. అమ్మకాలన్నీ పూర్తయ్యాకే మే 1న రిలీజ్ అనుకున్నామని.. కానీ ‘ఎవెంజర్స్’ సినిమా కోసమని తమ చిత్రాన్ని వాయిదా వేయగా.. ఆ తర్వాత అనేక సమస్యలు చుట్టుముట్టాయని.. తమ సినిమాకు వ్యతిరేకంగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు కేసు వేసి కోర్టుకెళ్లడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని నిఖిల్ చెప్పాడు. ఏదేతేనేం.. అన్ని అడ్డంకులనూ దాటుకుని ఈ శుక్రవారం తన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని.. కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిఖిల్ ధీమా వ్యక్తం చేశాడు.