సారీ చెప్పేదే లేదని తేల్చేసిన ఫైర్ బ్రాండ్ సింగర్

August 03, 2020

అన్యాయం ఎదురైనప్పుడు.. ఏం చేస్తాం.. ఇదంతా నా కర్మ అనుకోవటం చాలామందిలో చూస్తుంటాం. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా పోరాడతారు. దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. తాను తలపడేది ఎవరితో అన్న విషయాన్ని అస్సలు పట్టించుకోరు. ఇలాంటి తీరు మామూలుగా అయితే ఓకే కానీ.. సెలబ్రిటీలు.. ప్రముఖులకు అంత తేలిక కాదు. ఎందుకంటే.. ఏదైనా విషయం మీద న్యాయం కోసం పోరాటం షురూ చేసిన వెంటనే వచ్చే ఒత్తిళ్లు.. రాయబారాలు అన్ని ఇన్ని కావన్నట్లుగా ఉంటాయి.

ఇలాంటివాటిని తట్టుకోవటం అంత తేలిక కాదు. మీటు ఆరోపణలతో పాటు.. తనకు ఎదురైన వేధింపుల గురించి ఓపెన్ అయి సంచలనంగా మారారు ప్రముఖ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. ఇది ఒక కొలిక్కి రాకముందే ఆమెకు సీనియర్ నటుడు కమ్ దక్షిణ భారత డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధారవితో ఆమెకున్న వివాదం గురించి తెలిసిందే.
2018లో జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో రాధారవి అధ్యక్షుడిగా ఎన్నిక కావటం.. అతడి తీరును తప్పు పడుతూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి వారి మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధం కాగా.. సభ్యత్వం చెల్లించలేదంటూ ఆమెను యూనియన్ నుంచి తొలగించారు. దీంతో కోర్టును ఆమె ఆశ్రయించారు. తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చినా యూనియన్ లోకి చేర్చుకోలేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రాధారవి పోటీ చేశారు. ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా దాఖలు చేసిన నామినేషన్ ను రద్దు చేయటంతో కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఫలితం ఆమెకు అనుకూలంగా రాలేదు. దీంతో.. ఆమె అప్పీలుకు వెళ్లారు. ఇలాంటివేళ.. జరిగిన ఎన్నికల్ని అడ్డుకునేందుకు పోలింగ్ జరిగే ప్రాంతానికి చిన్మయి వస్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాధారవి.. చిన్మయి సారీ చెబితే ఆమెను యూనియన్ లోకి చేర్చుకుంటామన్నారు. ఇలాంటి మాటలు మిగిలిన వారి దగ్గర నడుస్తాయేమో కానీ.. చిన్మయి లాంటి వారి వద్ద నడవవు కదా? రాధారవి మాటల మీద చిన్మయి రియాక్ట్ అయ్యారు. తాను సారీ చెప్పనని.. రాధారవి ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకోవటం కానీ జరగదని తేల్చేశారు. చట్టప్రకారం తాను పోరాటం చేస్తానని చెప్పిన తీరు చూస్తే.. వీరిద్దరి మధ్య వివాదం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా లేదని చెప్పక తప్పదు.