కంగ‌నా క‌ల‌క‌లం.. ఓటేసి ఘాటు వ్యాఖ్య !

July 03, 2020

ఓటేసి వ‌చ్చే సెల‌బ్రిటీల ముందు మైకులు పెట్ట‌టం ఛాన‌ళ్ల ప్ర‌తినిధుల‌కు మామూలే. ఓటేసిన వైనాన్ని కెమేరాల‌కు చూపిస్తూ.. త‌మ సందేశాన్ని చెప్పే ప్ర‌ముఖులు సాదాసీదా వ్యాఖ్య‌లు చేస్తుంటారు. అంద‌రిలా వ్య‌వ‌హ‌రిస్తే ఆమెను కంగ‌నా రౌన‌త్ ఎందుకంటారా? తాను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పే రియ‌ల్ క్వీన్.. తాజాగా తాను చేసిన వ్యాఖ్య కొత్త క‌ల‌క‌లానికి తెర తీసింద‌ని చెప్పాలి.
పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఆమె చేసిన రాజ‌కీయ వ్యాఖ్య హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. ఆమె మాట్లాడిన తీరుపై విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో త‌న తీరుతో వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా కంగ‌నా పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఓటేసిన సంద‌ర్భంగా రాజ‌కీయ క‌ల‌క‌లం రేపేలా ఆమె మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.
ఓటేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భార‌త‌దేశానికి నిజ‌మైన స్వాతంత్య్రం ఇప్పుడు వ‌చ్చింద‌ని వ్యాఖ్యానించ‌టం విశేషం. దేశం.. ఇటాలియ‌న్ ప్ర‌భుత్వ పాల‌న నుంచి విముక్తి పొందింద‌ని ఆమె చేసిన వ్యాఖ్య‌తో కంగ‌నా ఎవ‌రికి ఓటేశారో చెప్పేసిన‌ట్లైంది.
గ‌తంలో మొఘ‌లులు.. బ్రిటీష‌న్ల‌కు.. ఇటాలియ‌న్ ప్ర‌భుత్వాల‌కు బానిస‌లుగా ఉన్నామ‌ని.. ఇప్ప‌టికైనా ఓట‌ర్లంతా ఓటుహ‌క్కును వినియోగించుకోవాల‌ని ఆమె చెప్పిన మాట కొంత బాగానే ఉన్నా.. ఇటాలియ‌న్ ప్ర‌భుత్వం అన్న మాట దేన్ని ఉద్దేశించి చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఓటు వేసి వ‌చ్చి బుద్ధిగా నాలుగు మాట‌లు మాట్లాడి వెళ్లాల్సిన కంగ‌నా.. త‌న వ్యాఖ్య‌ల‌తో కొత్త క‌ల‌క‌లాన్ని రేపింద‌నే చెప్పాలి. అయినా.. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఇలా రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేయ‌టం చ‌ట్ట‌బ‌ద్ధ‌మేనా?