ఏపీ సర్కారు మరో అత్యుత్సాహం

July 08, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనకు వచ్చిన ఐడియా బ్రహ్మాండమైన ఐడియా అన్న భ్రమలో ఉన్నారు. పైగా తన ఐడియాకు ఏ అడ్డంకులు రావన్న ఊహాలోకంలో ఉన్నారు. ఆ ఐడియా ఏంటంటే... రాజధాని మార్పు. అది తన హక్కుగా భావిస్తున్న జగన్... అది పూర్తయ్యేనాటికి ఏ ఇబ్బందులు వస్తాయో కనీసం అవగాహన లేకుండా ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఐ లవ్ అమరావతి బోర్డును తాజాగా తొలగించారు. ఇక అమరావతి ఎంతమాత్రమూ రాజధాని కాదని ఫిక్సయిపోయిన సీఎం ఆమేరకు సైలెంట్ గా సందేశం పంపించేశారు. అందులో భాగంగా అక్కడి అధికారులు ఆ బోర్డును లేపేశారు.

 

అమరావతి కేవలం అక్కడి రైతుల భూములతో మాత్రమే లింక్ అయిన సమస్య కాదు. దాని చుట్టూ అనేకం ఉన్నాయి.

కేంద్ర సంస్థలు అక్కడ స్థలాన్ని తీసుకుని గవర్నమెంటుకు డబ్బులు కట్టాయి. అమరావతి బాండ్లను స్టాక్ ఎక్స్చేంజి ద్వారా దేశంలో పలువురు కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలున్నాయి. పలు కార్పొరేట్ కంపెనీలు అక్కడ గవర్నమెంటు హామీతో సంస్థలను ఏర్పాటుచేశాయి. ఇలా వీటన్నింటినుంచి ఎలాంటి న్యాయ చిక్కులు ఎదురవుతాయో చెప్పలేని పరిస్థితి. వీరంతా కోర్టుకు వెళ్తే... అవి తేలేదాక రాజధాని కదలదు. అప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా ఆశ్చర్యం లేదు. ఈ పరిణామాలు ఆలోచించకుండా ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు గట్టిగా బెడిసికొడితే... ఏపీ ప్రజలు అపుడు నెత్తీనోరు బాదుకోవాలి. మరి ఈ దూకుడుకు ఎక్కడ బ్రేక్ పడుతుందో చూడాలి.