సీఎం రమేష్ నో అన్నాడు

July 04, 2020

ఏపీలో టీడీపీ దారుణ పరాజయం మూటగట్టుకోవడంతో ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కొందరి పేర్లూ ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో ఆయా నేతలు ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తామేమీ పార్టీ మారడం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికే జేసీ బ్రదర్స్ పేర్లు ఇలా బాగా ప్రచారమయ్యాయి. వారు బీజేపీలో చేరడం ఖాయమని వినిపించింది. అయితే.. అలాంటిదేమీ లేదని వారు ఖండించారు. తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారమంతా అసత్యమని.. తానేమీ పార్టీ మారడం లేదని సీఎం రమేశ్ నిన్న మీడియాకు చెప్పారు.
విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ఎంపీలతో భేటీ కాగా.. దానికి సీఎం రమేశ్ కూడా హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆ సమావేశంలో చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని, తాము కూడా ఈ విషయంలో ఎవర్నీ కలవలేదని, టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారరని స్పష్టం చేశారు.
కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ ఎంపీలు కొందరు బీజేపీతో సన్నిహితంగా ఉన్న వ్యవహారం చర్చనీయమైంది. సుజనాచౌదరి, అశోక్ గజపతి రాజు వంటి వారు బీజేపీ చేతిలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. సుజనా పలు ఆర్థికపరమైన కేసుల్లో ఉండడంతో ఆయనకు కేంద్రం సహకారం అవసరమని.. ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారమైంది. ఇప్పుడు సీఎం రమేశ్ కూడా తాను టీడీపీలో ఉంటే వైసీపీ ప్రభుత్వం తన కాంట్రాక్టులు, వ్యాపారాలన టార్గెట్ చేస్తుందన్న ఉద్దేశంతో సేఫ్టీ కోసం బీజేపీలోకి వెళ్లాలనుకుంటున్నారని అంటున్నారు. కానీ, ఆయన మాత్రం అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేస్తున్నారు.