చంద్ర‌బాబు ఛాలెంజ్ - కేసీఆర్ నేను నీకిచ్చే గిఫ్ట్ ఇదే!

May 21, 2019

మొన్న‌టి ప్రెస్‌మీట్ నుంచి చంద్ర‌బాబు నాయుడులో కొత్త మ‌నిషి క‌నిపిస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సాధార‌ణంగా దురుసుగా మాట్లాడ‌రు. కానీ మొన్నటి నుంచి వ‌రుస మార్చారు. మొన్నేమే నువ్వు ఏపీని నీ సామంత రాజ్యంగా చేసుకుంటానంటే ఇక్క‌డెవ‌రూ మూసుక్కూర్చోరు అని తెగేసి వార్నింగ్ ఇచ్చిన చంద్ర‌బాబు... ఈరోజు కేసీఆర్ కు ఛాలెంజ్ చేశారు. 

క‌ర్నూలు జిల్లాలో జరిగిన ఓ స‌భ‌లో చంద్ర‌బాబు కేసీఆర్ - జ‌గ‌న్ ల‌క్ష్యంగా వ్యాఖ్య‌లు చేశారు.  వైసీపీకి ఎన్నిక‌ల పెట్టుబడి పెట్టి ఎగదోయడమే తానిచ్చే రిటర్న్ గిఫ్ట్ అని కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ కాచుకో...  నీ సామంతుడు జగన్ ను ఓడించి ఆ ఓటమిని నీకు గిఫ్టుగా పంపిస్తాను అంటూ నిండు స‌భ‌లో చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 

రాష్ట్ర అభివృద్ధి గురించి నేను ఆలోచిస్తాను. దోపిడీ గురించి వాళ్లు ఆలోచిస్తారు. ప్ర‌జ‌ల గురించి నేను ఆలోచిస్తుంటే... జగన్ మాత్రం లోటస్ పాండ్ లో కూర్చుని కొత్త కుట్రలకు ప్లాను వేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడికి దమ్ముంటే ఏపీలో ఉండి పోరాడాలి. ఏపీలో అడుగుపెట్టి టీడీపీతో తలపడాలి.. అంటూ బాబు సవాల్ విసిరారు. ‌"ఢిల్లీ మోదీ, హైదరాబాద్ మోదీ, లోటస్ పాండ్ మోదీ ముగ్గురూ ఏపీ అభివృద్ధిని చూసి అసూయతో రగిలిపోతున్నారు.  మ‌న‌ల్ని వెన‌క్కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అంటూ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.