ఈసీ మోడీకి ఊడిగం చేస్తోంది, దాన్ని జైలుకు పంపుతా !!

July 12, 2020

ఎన్నిక‌ల సంఘం మీద ఆరోప‌ణ‌లు కొత్త‌కాదు. కానీ ఈ స్థాయిలో ఎన్నిక‌ల సంఘం మీద విరుచుకుప‌డ‌టం ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌లేదు. ఆ సాహ‌సానికి ఒడిగ‌ట్టింది... డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ మ‌న‌వడు, భరిప బహుజన్‌ మహాసంగ్‌ ఛైర్మన్‌ ప్రకాశ్‌ అంబేడ్కర్‌. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. నేను ఈ వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాను. మోడీ ఏం చెబితే ఎన్నిక‌ల సంఘం అదే చేస్తోంది. మేము అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘాన్ని రెండు రోజుల పాటు జైలుకు పంపుతామని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.
అధికార పార్టీ బీజేపీకి **ఈసీ** అనుకూలంగా వ్యవహరిస్తున్న మాట ప‌చ్చినిజం అని ఆయ‌న బల్ల‌గుద్ది చెప్పారు. ‘‘రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం ఉంది. నియమాలు అనుమతిస్తున్నాయి. అయినా పుల్వామా ఘటనపై మాట్లాడకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇది మోడీ - ఎన్నిక‌ల సంఘం ఉమ్మ‌డి కుట్ర‌. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నికల సంఘాన్ని వదిలే ప్ర‌సక్తే లేదు అని ఆయ‌న తీవ్రంగా వ్యాఖ్యానించారు. నిష్ప‌క్ష‌పాత వైఖ‌రి పాటించ‌ని ఈసీకి జైలు శిక్ష ప‌డాల్సిందే అన్నారు. ఈయ‌న ఎవ‌రితో జ‌త క‌ట్టారో తెలుసా... హైద‌రాబాదుకు చెందిన‌ ఓవైసీ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో పాటు క‌ర్ణాట‌క‌లోని జనతాదళ్‌(ఎస్‌) కలిసి సంయుక్తంగా మహారాష్ట్రంలో పోటీ ప‌డుతున్నాయి. ఈ కూట‌మి పేరు వంచిత్‌ బహుజన్‌ అగాది. ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఈ కూటమి తరఫున సోలాపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు అకోలా స్థానం నుంచి బరిలో ఉన్నారు. 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో 30 గెలుచుకుంటామ‌ని ఈ కూట‌మి ఆత్మ‌విశ్వాసం వెలిబుచ్చుతోంది.