అంతా ఉత్తిదేనటగా... ఆయనే చెప్పారు

July 04, 2020

నిన్న ఒంగోలు బాధితురాలిని పరామర్శించిన అనంతరం తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ ఓ వ్యాఖ్య చేశారు. తెలుగుదేశం పార్టీతో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందన్నది ఆ మాటల పరమార్థం. అయితే, ఇది కేవలం జగన్ స్థాయిలో మాత్రమే జరగడం లేదు, కార్యకర్తల లెవెల్లో జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. లేకపోతే కొన్ని రోజులుగా ఇంటర్నెట్ కేంద్రంగా ఓ విచిత్రమైన ప్రచారం జరిగింది. ముందుగా జగన్ అనుకూల వెబ్ సైట్లో ఓ ప్రచారం మొదలుపెట్టారు. తెలుగుదేశం నుంచి గంటా నేతృత్వంలో 15 మంది ఎంపీలు పార్టీ మారుతున్నారని, బీజేపీలో పార్టీని కలిపేస్తారని, మూడింట రెండొంతుల మెజారిటీతో వెళ్తారు కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీ ఏపీలో మిగలదని ఇలా తెగ అల్లేశారు. దీనికి ఒక ఆధారం కూడా పట్టుకొచ్చారు.
తన వ్యక్తిగత పనుల మీద గంటా శ్రీనివాసరావు కొలంబో వెళ్తే... 15 మంది ఎమ్మెల్యేలు కొలంబోలో ఉన్నట్టు... వారంతా అట్నుంచి అటే ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం చేశారు. తెలుగుదేశం శ్రేణుల్లో ఒకరకమైన ఆందోళన సృష్టించే ప్రయత్నం ఇది. వాస్తవానికి కొలంబోలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారు గంటాతో పాటు వెళ్లారు. ఇక ఈ విషయం ఇతర మీడియాకు కూడా పాకి పదేపదే ప్రచారం జరుగుతుండటంతో స్వయంగా గంటా శ్రీనివాసరావు స్పందించి కొట్టిపారేశారు.
నేను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారు. ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయి, ఎప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయి, తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తే లేదు.... అంటూ ఆయన స్వయంగా తన అధికారిక ట్విట్టరులో పోస్టు చేశారు. దీంతో ఇక బ్లాక్ మీడియా ఈ కథనాల ప్రసారం ఆపేసింది. వాస్తవానికి ఇది వైసీపీ వండిన వార్త మాత్రమే. అందులో కించిత్ నిజం కూడా లేదు. గంటాకి చాలా వ్యాపారాలు ఉండటంతో సులువుగా నమ్మేస్తారని భావించారు. అందుకే దీనిని ప్రచారం చేశారు. సంపూర్ణ అధికారం వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశంపై కక్ష సాధింపు చర్యలు తప్ప వైకాపా ఇతర ముఖ్య విషయాలపై దృష్టిపెట్టడం లేదని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.