కేసీఆర్ తో పనిచేయలేం... ఐఏఎస్ ఆఫీసర్ సంచలనం

August 05, 2020

అదేంటి... ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అవ‌కాశం ఇస్తానంటే..ఎవ‌రైనా వ‌ద్దంటారా?  పైగా మొండిఘ‌టం..తాను అనుకున్న‌దే...త‌న‌కు న‌చ్చిన‌ట్లే చేసే తెలంగాణ సీఎం కేసీఆర్ అవ‌కాశం ఇస్తాన‌ని ప్ర‌క‌టిస్తే....దాన్ని కాద‌నేవాళ్లు ఉన్నారా? అలా చేసే వారు ఎంత అమాయ‌కులో క‌దా?... ఇలా ఆలోచిస్తున్నారా?. కేసీఆర్ వ‌ద్ద చాన్స్ వ‌చ్చినా వ‌ద్దు అనుకునేది అల్లాట‌ప్పా వాళ్లేం కాదు. భార‌త‌దేశంలో అత్యున్న‌త‌మైన అఖిల‌భార‌త సర్వీసైన‌ ఐఏఎస్ అధికారులు. అందులోనూ...ఈ స‌ర్వీసులో దాదాపు 20 ఏళ్ల స‌ర్వీసును పూర్తి చేసుకున్న‌వారు.
విష‌యం వివ‌రంగా చెప్పాలంటే....తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్‌) ఎస్‌కె జోషి ఈ నెల 31న  పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  పోస్టు చాలా ముఖ్య‌మైంది కాబ‌ట్టి ఇప్ప‌టి నుంచే అధికారుల గురించి స‌ర్కారు పెద్ద‌లు ఆరాతీయ‌డం, ఈ ప‌ద‌వి గురించి ఐఏఎస్‌లు చ‌ర్చించుకోవ‌డం స‌హ‌జంగానే జ‌రుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం సీఎంకేసీఆర్‌ 14 మంది పేర్లను పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే వారిలో చాలా మంది అయిష్టంగానే ఉన్నట్టు తెలిసింది. గతంలో ఈ పోస్టు కోసం రెండు, మూడు నెలలకు ముందే, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు 'క్యూ' కట్టేవారు..తమ సీనియార్టీ ధృవపత్రాలను ప్రభుత్వానికి సమర్పించే వారు. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ... ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసేవారు. ఎవరికివారు తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేసేవారు. ఒకవేళ సీనియార్టీ ప్రకారం సీఎస్‌ పోస్టు దక్కకుంటే, ట్రిబ్యూనల్‌ను సైతం ఆశ్రయించి దాన్ని సాధించేంత పోటీ ఉండేది. కానీ ఇప్పుడు సీఎస్‌ పోస్టు సీన్‌ పూర్తిగా మారిపోయింది.
ఎందుకో తెలుసా?  ముఖ్య‌మంత్రి సీటులో ఉంది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాబ‌ట్టి!. ఒక‌టో రెండో కార‌ణాలు ఉంటే ఓకే కానీ...అనేక స‌మ‌స్య‌లు, ఇబ్బందులు, ప‌రువుకు సంబంధించిన అంశాలు ఉన్న‌ప్పుడు సీఎస్ ప‌ద‌వి ఎందుక‌ని కొంద‌రు ఐఏఎస్‌లు అనుకుంటున్నార‌ట‌. సీఎస్‌కు ఉన్న అధికారాల విషయంలోనూ ప్రభుత్వం బ్రేక్‌ వేయడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇక  సీఎస్‌ పరిధిలో ఉన్న అధికారాల అంశాల్లో కూడా సీఎంవో జోక్యం చేసుకుంటుందనే భావన, సచివాలయం లేకపోవడం, అరకొర వసతులున్న బీఆర్‌కే భవన్‌కు వెళ్లడానికి అయిష్టతతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు పట్ల అనాసక్తితో ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయా శాఖల సమీక్షలు, సమావేశాలకు కూడా ముఖ్యమంత్రి, సీఎస్‌ను ఆహ్వానించకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎస్‌కు ఉన్న అధికారాలను ప్రశ్నార్ధకం చేస్తున్న త‌రుణంలో...ఆ పోస్టు తీసుకోవ‌డం ఎందుకు...అనంత‌రం అపసోపాలు ప‌డ‌టం ఎందుక‌ని....ఐఏఎస్‌లు లైట్ తీసుకుంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.