ఆ ఘటనతో.. చిక్కుల్లో ఏపీ సర్కారు

August 15, 2020

నిజాయితీకి నిలువెత్తు రూపంగా వ్యవహరించే ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్యాన్ని కారణంగా చూపించి ఈ మరణం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఏపీ సర్కారుతో పాటు.. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఒక సీనియర్ అధికారి మొండితనం.. ఈగో.. సదరు మహిళా ఐఏఎస్ మరణానికి కారణంగా చెబుతున్నారు.

ముక్కుసూటిగా వ్యవహరిస్తూ.. వందల కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జాల నుంచి కాపాడిన ఆమె.. ఇప్పుడు అర్థాంతరంగా మరణించటం వెనకున్న విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
ఇంతకీ ఆ మహిళా ఐఏఎస్ ఎవరు? ఆమెను మానసికంగా వేధించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎవరు? ఎందుకిలా జరిగింది? కొన్ని ఉదంతాల్లో మీడియాలో ప్రముఖంగా కవర్ అయ్యేది కాస్తా.. మహిళా ఐఏఎస్ విషయంలో మాత్రం ఎవరికి ఎందుకు పట్టటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా.. నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని కాపాడిన అధికారిణిగా.. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించే కియా కార్ల ఏర్పాటులో కీలక భూమిక పోషించిన రమామణి ఆకస్మికంగా మృతి చెందటం ఇప్పుడో ఇష్యూగా మారింది.

ఆమె మరణం వెనుక సీనియర్ ఐఏఎస్ అధికారి.. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ వేధింపులే కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు. పెద్ద కారణాలు లేకున్నా.. రెండు నెలల పాటు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం ఏమిటన్నది చర్చగా మారింది. ఇంతకీ రమామణికి.. ప్రవీణ్ ప్రకాశ్ కు గొడవ ఎక్కడ షురూ అయ్యిందన్నది చూస్తే..

కొద్ది కాలం క్రితం ప్రవీణ్ ప్రకాశ్ ఆఫీసు నుంచి రమామణికి ఒక ఫోన్ వచ్చింది. కారు ఒకటి అరేంజ్ చేయాలని కోరితే.. ఇవ్వలేమని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలా మొదలైన చిన్న స్పర్థ.. వ్యక్తిగతంగా వేధింపులకు వరకూ వెళ్లటమే కాదు.. అవసరం ఉన్నా లేకున్నా ఫిర్యాదు చేయటంతో తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు.

ఎంతో కమిట్ మెంట్ తో వ్యవహరించే రాధారమణికి.. వరుస పెట్టి ఎదురవుతున్న అవమానాల్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో.. అనారోగ్యానికి గురైన ఆమె.. కన్నుమూసినట్లు చెబుతున్నారు. 

ప్రవీణ్ ప్రకాశ్ తీరు ఏ మాత్రం బాగోవటం లేదని.. కొందరు అధికారుల విషయంలో ఆయన తీరును పలువురు తప్పుపడుతున్నారు. ఆయన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి ఒక కమిషన్ వేసి.. బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటే.. మరోసారి ఇలాంటి ఉదంతం చోటు చేసుకునే అవకాశం ఉండదు. పని పట్ల కమిట్ మెంట్ తో వ్యవహరించే వారి విషయంలో అనవసర కెలుకుడు మొదటికే మోసం వస్తుందన్న విషయం అందరికి తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి.. రామామణికి న్యాయం జరుగుతుందా? అన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలదు.