జగన్ సీఎం కావడంతో నష్టపోయిన వృద్దులు

May 28, 2020

​చిత్తూరులోని తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. పేదవాడి కోసం బతుకుతున్నామని చెప్పి వారికి జగన్ భవిష్యత్తే లేకుండా చేస్తున్నారని అన్నారు.  ​తాము తెచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేస్తే నష్టపోయేది మేము కాదని, ప్రజలే అని చంద్రబాబు అన్నారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే... ఈపాటికి వృద్ధుల పింఛన్లు 3000 వేలు అయిఉండేవని అన్నారు. 

కంపెనీలను తరిమేస్తు రాష్ట్ర ద్రోహులుగా మారిన జగన్ భవిష్యత్తులో పారిశ్రామిక వేత్తలు ఏపీ అంటేనే భయపడేలా చేస్తున్నారని అన్నారు. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వస్తే మొదట లబ్ది పొందేది పేదవాడు, ఆ తర్వాత వేతన జీవి అని బాబు అన్నారు. పరిశ్రమల రాకతో నిర్మాణ రంగం, మానవ వనరుల అవసరాలకు సంబంధించిన ఉపాధి పెరిగి ప్రజల ఆదాయం పెరుగుతుందని ఇదంతా అర్థం చేసుకునేంత విజన్ మన ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం అన్నారు. వైసీపీకి ఓటేసిన వారే తప్పు చేసిన ఫీలింగ్ లో తల బాదుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.  

నీటి పారుదలను జగన్ గాలికి వదిలేశారు. తెలుగుదేశం హయాంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చేవి. ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో పనులు జరిపాం.  ఇపుడు ఒకట్రెండు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాంట్రాక్టర్ల అలసత్వం దీనికి కారణం.  మరో రూ.20 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పూర్తవుతుందని, దీనిపై ముఖ్యమంత్రి శ్రద్ధ పెట్టాలని అన్నారు. 'నా మీద ఆరోపణలు చేసినవారంతా ఏం తవ్వితీయలేకపోయారు. ఈయన ఏదో తవ్వుతారట. చివరికి ఎలుక తోక కూడా పట్టుకోలేరు‘ అంటూ చంద్రబాబు విమర్శించారు. ఎన్ని సిట్ లు వేసి... ఏమైనా తవ్వుకోండి అని సవాల్ విసిరారు.