వారంతా గెలిచి పవన్ ఓడిపోతే ఏమవుతుంది..?

February 19, 2020

ఏపీ ఎన్నికల్లో 2009 తరువాత మళ్లీ ఈసారి ముక్కోణపు పోటీ ఏర్పడింది. అందుకు కారణం జనసేన అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. అభ్యర్థుల ఎంపిక.. నాయకులు లేకపోవడం అనేది ఆ పార్టీకి భారీ విజయావకాశాలు లేకుండా చేసింది. పార్టీ అద్యక్షుడ పవన్ రెండు స్తానాల నుంచి పోటీ చేస్తుండగా రెండు చోట్లా కచ్చితంగా గెలుస్తారన్న అంచనాలు కూడా లేవు. ఇదే సమయంలో ఆయన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు గెలిచే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు ఉండి.. అక్కడ జనసేన అభ్యర్థులు కూడా బలంగా ఉంటే అలాంటి చోట ఆ పార్టీ గెలవొచ్చనే అంచనాలున్నాయి. కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో అలాంటి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ నుంచి మంత్రి కొల్లు రవీంద్ర, వైసీపీ నుంచి పేర్ని నాని పోటీ చేయగా అక్కడ జనసేన నుంచి బండి రామకృష్ణ బరిలో నిలిచారు. రామకృష్ణకూ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలాగే అవనిగడ్డలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్, వైసీసీ నేత సింహాద్రి రమేశ్, జనసేన నుంచి ముత్తంశెట్టి కృష్ణారావు పోటీ చేయగా ముత్తంశెట్టి కూడా విజేతగా నిలిచే అవకాశముందంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో యనమల కృష్ణుడు(టీడీపీ), దాడిశెట్టి రాజా(వైసీపీ), వత్సవాయి రాజా(జనసేన) బరిలో ఉన్నారు. ఇక్కడా జనసేనను లెక్కలోకి తీసుకుంటున్నాు. కొత్తపేటలో బండారు సత్యానందరావు(టీడీపీ), చిర్ల జగ్గిరెడ్డి(వైసీపీ), బండారు శ్రీనివాసరావు(జనసేన) పోటీ చేయగా బండారు శ్రీనివాసరావుపైనా అంచనాలున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు- నిమ్మలరామానాయుడు(టీడీపీ), డాక్టర్ బాబ్జీ(వైసీపీ), గున్నం నాగబాబు(జనసేన)లు పోటీలో ఉన్నారు.. తాడేపల్లిగూడెంలో ఈలినాని(టీడీపీ), కొట్టు సత్యనారాయణ(వైసీపీ), బొలిశెట్టి శ్రీనివాస్(జనసేన)... ఏలూరులో బడేటి బుజ్జి(టీడీపీ), ఆళ్ల నాని(వైసీపీ), రెడ్డి అప్పలనాయుడు(జనసేన).. నర్సాపురంలో బండారు మాధవనాయుడు(టీడీపీ), ముదునూరి ప్రసాదరాజు(వైసీపీ), బొమ్మిడి నాయకర్(జనసేన).. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు(టీడీపీ), గ్రంధిశ్రీనివాస్(వైసీపీ), పవన్ కల్యాణ్(జనసేన).. స్థానాల్లో జనసేనకు విజయావకాశాలున్నాయంటున్నారు.
విశాఖ జిల్లాలో గాజువాకలో పల్లా శ్రీనివాసరావు(టీడీపీ), తిప్పల నాగిరెడ్డి(వైసీపీ), పవన్ కల్యాణ్(జనసేన)... పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి(టీడీపీ), అదీప్ రాజు(వైసీపీ), చింతలపూడి వెంకటరామయ్య(జనసేన) స్థానల్లోనూ జనసేనకు గెలుపు చాన్స్ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పెందుర్తిలో పోటీ చేసిన వెంకటరామయ్య నిజానికి గాజువాకలో 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. ఈసారీ గాజువాకలో జనసేన నుంచి పోటీ చేయడానికి అక్కడ చాలాకాలం నుంచే గట్టి ప్లాట్ ఫాం వేసుకున్నారు. అయితే.. పవన్ అక్కడి నుంచి పోటీ చేస్తాననడంతో ఆయన్ను పెందుర్తికి పంపించారు. పెందుర్తిలో టీడీపీ, వైసీపీల ఓట్ల మధ్య తేడా ఎక్కువ లేకపోతే వెంకటరామయ్యకు అవకాశం దొరకొచ్చన్న అంచనాలున్నాయి. అలాగే.. తాడేపల్లిగూడెంలో ముగ్గురూ బలమైన అభ్యర్థులే. ఈలినాని, కొట్టు సత్యనారాయణల ఓట్ల మధ్య పెద్ద వ్యత్యాసం లేకపోతే అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచే అవకాశం ఉందంటున్నారు. మచిలీపట్నంలోనూ బండి రామకృష్ణ కూడా బలమైన అభ్యర్థిగానే ఉన్నారు.
అదే సమయంలో గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ గెలిచే అవకాశమున్నా ఆయన విజయం గ్యారంటీ అని చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒక వేళ పవన్ ఓటమి పాలై పైన చెప్పుకొన్న నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గెలిస్తే మాత్రం పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా అది పెద్ద దెబ్బే అని చెప్పాల్సి ఉంటుంది.