మోడీ పొగిడారంటే.. వారి ప‌ని అయిపోయిన‌ట్లే!

July 02, 2020

ఈ మ‌ధ్య‌న మ‌రీ బొత్తిగా భ‌యం భ‌క్తి లేకుండా పోయింది. ప్ర‌ధాన‌మంత్రి స్థానంలో కూర్చున్న మోడీని ఉద్దేశించి ఎంత మాట ప‌డితే అంత మాట అనేస్తున్నారీ హిందూ ద్రోహులంటూ విరుచుకుప‌డే వారి మాట‌ల్ని వ‌దిలేద్దాం. ఎందుకంటే.. మోడీని హిందూజాతిని ఉద్ద‌రించ‌టానికే పుట్టారంటే అంతుకు మించిన హాస్య‌స్ప‌దమైన వ్యాఖ్య మ‌రొక‌టి ఉండ‌దు. ఒక‌వేళ అదే నిజ‌మైన ప‌క్షంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఆయ‌న చేయాల్సింది చాలానే ఉంది.
హిందువుల‌కు మోడీ ర‌క్ష‌కుడిగా భావించే వారిని వ‌దిలేద్దాం. నిజాన్ని నిజంగా.. అబ‌ద్ధాన్ని అబ‌ద్ధంగా చూడ‌గ‌లిగే వారు మాత్ర‌మే వాస్త‌వాల్ని అంగీక‌రించ‌గ‌ల‌రు. ఎందుకంటే.. ఇప్పుడు చెప్పే విష‌యాలు అలాంటివి. పార్టీకి చెందిన నేత ఎవ‌రైనా స‌రే.. మోడీ మాష్టారి నోటి నుంచి పొగ‌డ్త మాట వ‌చ్చిదంటే చాలు.. వారి కెరీర్ క్లోజ్ అయిన‌ట్లుగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే చాలానే ఉదంతాలు ఉన్నాయి.
పెద్ద‌లంటే భ‌యం భ‌క్తితో పాటు.. ప్రేమాభిమానాల‌ని చెప్పే మోడీ మాట‌ల‌కు చేత‌ల‌కు చాలానే తేడా ఉంటుంది. కానీ.. ఎవ‌రి సాఫ్ట్ వేర్ అయినా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే.. దాన్ని క్రాక్ చేయ‌టం క‌ష్టం కాదు. మోడీ మాష్టారు సైతం ఇందుకు మిన‌హాయింపు కాదు. మోడీ నోటి నుంచి ఎవ‌రినైనా పొగిడారంటే చాలు.. వారి ప‌ని అయిపోయిన‌ట్లే అన్న దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీని చెప్పొచ్చు.
త‌న రాజ‌కీయ గురువు మాత్ర‌మే కాదు.. గుజ‌రాత్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారంటే అది కేవ‌లం అద్వానీ పుణ్య‌మే. అలాంటి ఆయ‌న్ను ఉద్దేశించి మొద‌ట్లో పొగిడిన‌ప్పుడు అంద‌రూ.. ఏమి గురుభ‌క్తి అనుకున్నారు. కానీ.. అదంతా ఎలాంటిద‌న్న విష‌యం త‌ర్వాతి రోజుల్లో ఇట్టే అర్థ‌మైన ప‌రిస్థితి.
త‌ర్వాతి కాలంలో సీనియ‌ర్ నేత వెంక‌య్య‌నాయుడి సంగ‌తి చూస్తే.. ఈ విష‌యం మీద ఎంతో క్లారిటీ వ‌స్తుంది. గుజ‌రాత్ వ‌దిలి ఢిల్లీ వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కెంతో గంద‌ర‌గోళంగా అనిపించిన‌ప్పుడు.. త‌న‌కెంతో అండ‌గా ఉన్న‌ది వెంక‌య్యేన‌ని చెబుతూ.. ఆయ‌న్ను పెద్ద ఎత్తున పొగిడేశారు. అలాంటి వెంక‌య్య నోటికి తాళం వేస్తూ.. ఉప‌రాష్ట్రప‌తి కుర్చీలో కూర్చొపెట్టి చేతులు క‌ట్టేయ‌టం తెలిసిందే.
తాజాగా లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ను మోడీ తెగ పొగిడేస్తున్నారు. ఈ దేశంలో త‌న‌ను మంద‌లించ‌గ‌లిగిన వ్య‌క్తి ఆమె ఒక్క‌రేనంటూ పొగిడేశారు. మ‌రింత సీనియ‌ర్ నేత‌ను మోడీ పొగిడితే ఏదో లెక్క తేడా వ‌చ్చిన‌ట్లే. నిజ‌మే.. ఎనిమిది సార్లు ఇండోర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన ఆమెకు.. ఈసారి క‌నీసం పార్టీ త‌ర‌పున పోటీ చేసే అవ‌కాశం కూడా ల‌భించ‌లేదు. దానికి కార‌ణం లేదు. సుమిత్రా ఎపిసోడ్ తో.. మోడీ నోటి నుంచి పొగ‌డ్త వ‌చ్చిందంటే.. వారిని రాజ‌కీయం నుంచి విముక్తం చేసే అద్భుత‌మైన అవ‌కాశం ఇచ్చిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీనా మ‌జాకానా!