పాతిక కేజీల బంగారాన్ని జస్ట్ 20 నిమిషాల్లో దోచేశారు

August 04, 2020

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాతిక కేజీలు. ఇంత భారీ బంగారాన్ని కేవలం ఇరవై నిమిషాల్లో దోచేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. పంజాబ్ లోని లూధియానాలో పట్టపగలు జరిగిన ఈ చోరీ సంచలనంగా మారింది. పక్కా ప్లాన్ తో చేసిన దోపిడీ ఇప్పుడక్కడి పోలీసు అధికారుల్ని తీవ్ర విమర్శలకు గురయ్యేలా చేస్తోంది.
పంజాబ్ లోని లూధియానాలోని ఐఐఎఫ్ఎల్ రుణ సంస్థలోకి వచ్చిన నలుగురు దుండగులు అక్కడి సిబ్బంది బెదిరించారు. వారి దగ్గరున్న తాళాలు తీసుకొన్నారు. ఆ వెంటనే సిబ్బందిని తాళ్లతో బంధించారు. అనంతరం వారు అక్కడున్న పాతిక కేజీల బంగారాన్ని సంచుల్లో వేసుకున్నారు.
ఆ సమయంలో సంస్థకు చెందిన సెక్యురిటీ సిబ్బంది లేకపోవటం గమనార్హం. తాము దోచిన సొత్తును తీసుకొని నిమిషాల్లో అక్కడి నుంచి పారిపోయారు. తాము కిందకు వచ్చేసరికి కారును సిద్ధంగా ఉంచుకున్న వారు.. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నారు. పాతిక కేజీల బంగారాన్ని కేవలం ఇరవై నిమిషాల్లో దొంగిలించిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. చోరీ చేసిన దొంగల కోసం పోలీసులు విపరీతంగా వెతుకుతున్నారు.

RELATED ARTICLES

  • No related artciles found