అలా జరిగితే ఆకలిచావులేనట..

August 11, 2020

ప్రపంచానికే పెద్దన్న. ఆర్థికంగా తోపుల్లాంటి యూరోపియన్ దేశాలు. సాంకేతికత విషయంలో తిరుగులేని చైనా లాంటి దేశాలే కరోనా భూతానికి ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి. అలాంటిది ఆర్థికంగా శక్తి లేని.. నిత్యం అగ్రరాజ్యాల దయాదాక్షిణ్యాలతో బండిని లాగే పాకిస్థాన్ లాంటి దేశానికి కరోనా ఇప్పుడో పెద్ద జీవన్మరణ సమస్యగా మారింది.  కరోనా కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..క్వారంటైన్ చేసే అంశాలకు సంబంధించి కట్టుదిట్టంగా..  కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది.
అలా చేస్తే కానీ వైరస్ ను అదుపులోకి తీసుకొచ్చే వీలుంది. ఇది పాకిస్థాన్ కు మరిన్ని సమస్యల్ని తెచ్చి పెడుతోంది. ఇదే విషయాన్ని తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. కరోనా నేపథ్యంలో యావత్ దేశాన్ని నిర్భంధంలో ఉంచాల్సిన పరిస్థితిని పాక్ భరించలేదన్న ఆయన.. పశ్చిమ దేశాల మాదిరి తాము వ్యవహరించలేమన్నారు.
ప్రముఖ నగరాల్ని నిర్బందించాలన్న ప్రతిపాదనకు తమ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుచెప్పారు. దీని వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుగుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. తీవ్ర ఆంక్షలు విధిస్తే.. పాక్ ప్రజలు ఆకలి చావులు చనిపోవటం ఖాయమంటున్నారు. ఇప్పటికే స్కూళ్లు.. కాలేజీలు మూసివేసిన వైనాన్ని గుర్తు చేస్తున్న ఇమ్రాన్.. దేశం తీవ్రమైన ఆర్థికలోటును ఎదుర్కొంటున్న వైనాన్ని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పాక్ లో 200 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1571 మంది అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి కనుక కట్టలు తెగితే.. దారుణ అనుభవం పాక్ కు మిగులుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.