తెలంగాణలో 17 స్థానాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరో నలభై రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అన్ని పార్టీలు విజయావకాశాలపై సమీక్షలు నిర్వహించుకుంటున్నాయి. ఈ క్రమంలో గెలుపు తమదంటే తమదంటూ చెప్పుకుంటున్నారు. ఎవరి అంచనాలు వారికి ఉన్నట్లుగా లెక్కలు కడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ తమ విజయావకాశాలపై ప్రభావం చూపబోదని అందరు అభ్యర్థులు అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలను అన్ని పార్టీల కంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ ఫోకస్ చేసింది. దీనికి కారణం కూడా అందరికీ తెలుసు. ఢిల్లీలో చక్రం తిప్పేందుకు అవసరమైనన్ని ఎంపీ స్థానాలు కావాలనుకుంటున్న కేసీఆర్.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను సైతం తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడిదే ఓ స్థానంలో విజయం కట్టబెట్టబోతుందట.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందిన ఎంపీ స్థానాల్లో మెదక్ ఒకటి. 2014 ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి 3.57లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆయన మరోసారి టికెట్ దక్కించుకున్నారు. ప్రభుత్వ అండ ఉండడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహించారు. మరోవైపు, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు చెందిన అభ్యర్థులు సైతం గట్టిగానే పోరాటం చేశారు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఆయన విజయం నల్లేరుపై నడకేనని, మెజారిటీ మాత్రం భారీగా రావాలని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు కూడా గులాబీ పార్టీకి బలం చేకూర్చాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని నియోజకవర్గాల్లో పూర్తిగా పట్టున్న ఇద్దరు సీనియర్ నేతలు కారెక్కడం ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పడంలో సందేహం లేదు.
గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చేతిలో ఓటమి పాలైన వంటేరు ప్రతాపరెడ్డి, నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి కారెక్కడంతో వారి ఓటుబ్యాంకు కూడా టీఆర్ఎస్కు అనుకూలమయ్యే అవకాశం ఉంది. నాడు వీరిద్దరికీ కలిపి సుమారు లక్షన్నర ఓట్ల వరకు వచ్చాయి. సంగారెడ్డి, పటాన్చెరువు, మెదక్‌లో మరో 50వేల మెజార్టీ అదనంగా వచ్చినా ప్రభాకర్ రెడ్డికి 5 లక్షల మెజారిటీ దాటుతాయనే అంచనాతో ఉన్నారు. కానీ పోలింగ్ శాతం తగ్గడంతో కొంత డైలామాలో పడ్డారు. 4లక్షల నుంచి 5లక్షల నడుమ మెజార్టీ వస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. అన్నీతానై చూసిన హరీశ్ రావు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ యాదవ్‌కు స్థానిక నాయకుల నుంచి సహకారం కొరవడింది. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటీ చేస్తున్నా.. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ లేదు. పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రచారం చేయలేదు. దీంతో టీఆర్ఎస్ హవా భీకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.