కరోనాపై యుద్ధం ముగించేది మనమేనా?

August 08, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు లేదన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తయారు చేసేందుకు  ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జర్మనీకి చెందిన ఒక సంస్థ.. కొన్ని శాంపిల్స్ ను ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు అవసరమైన వ్యా్క్సిన్ తయారుచేసే సత్తా తమకుందన్న మాటను చెప్పుకొచ్చారు భారత బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా.
ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. ,చైనా.. యూకే.. అమెరికాలోని శాస్త్రవేత్తలకు ధీటుగా మన దేశంలోని శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు.. సత్తా ఉన్న వారు మనకు ఉన్నారన్నారు. కాకుంటే.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలే కానీ.. వ్యాక్సిన్ తయారు చేయటం  పెద్ద విషయం కాదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో కేంద్రం సమావేశమైన.. స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తే.. ఇతర దేశాల కంటే ముందుగానే కరోనాకు వ్యాక్సిన్ ను తయారు చేసే అవకాశం ఉందన్నారు. కరోనాతో పోలిస్తే స్వైన్ ఫ్లూ అత్యంత ప్రమాదకరమైనదని.. దాని కారణంగా అమెరికాలో ప్రతి ఏటా 60వేల మంది మరణిస్తున్నారని.. యూరప్ లోనూ ఆ సంఖ్య ఎక్కువేనని చెప్పారు.
అయితే.. కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని.. కాకుంటే ఈ వైరస్ కు సరైన చికిత్స లేదన్నారు. అంతేకాదు.. కరోనా నుంచి స్వస్థత చేకూరిన తర్వాత కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చని.. అందుకే పెద్దవయస్కులు.. చిన్నపిల్లలు ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు సరైన మందు లేని నేపథ్యంలో యాంటీ వైరల్ ఔషధాలు ఇచ్చి వాడతున్నారని.. అంతకు మించిన మరో ప్రత్యేకమైన ఔషధం లేదన్నారు. అయితే.. వీటితో కరోనా వ్యాధి తగ్గిపోతుందని తాను చెప్పలేనని చెప్పారు.
కొంతవరకూ మలేరియా మందు పని చేస్తుందని.. కాకుంటే.. శాస్త్రీయంగా ఇంకా నిర్దారణ కాలేదన్నారు. మలేరియా ముందుఇస్తే త్వరగా కోలుకునే వీలుందని.. అదేసమయంలో ఆ వ్యక్తి నుంచి ఇతరులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉందంటున్నారు. మందులతో వైరస్ ను చెక్ చెప్పటం కష్టమని.. వ్యాక్సిన్ తయారుచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.