ఈ లెక్క చదివితే మీరు గుండెలు బాదుకుంటారు

August 09, 2020

వరుస పెట్టి పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. వరుస పెట్టి పన్నెండు రోజులుగా కేంద్రం ధరల్ని పెంచేస్తూ బాదేస్తోంది. ఓపక్క అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెద్దగా లేనప్పటికీ.. రికార్డు స్థాయి దిశగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇదంతా చూస్తున్న వారికి రానున్న రెండు నెలలోనే లీటరు పెట్రోల్ వందకు చేరుకున్నా ఆశ్చర్యపోలేని పరిస్థితి.

సాధారణంగా పెట్రోల్.. డీజిల్ ధరలు ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా హెచ్చుతగ్గులకు తగ్గట్లు ఉంటాయి. అందుకు భిన్నంగా అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నా దేశంలో మాత్రం భారీగా ధరలు పెరుగుతున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ముడిచమురు ధర బ్యారెల్ 55 డాలర్లు ఉంటే.. మార్చి వచ్చే నాటికి అది కాస్తా 35 డాలర్లకు పడిపోయింది. మహమ్మారి దెబ్బకు మార్చి చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పడిపోవటం.. విమానయానం పూర్తిగా పడకేయటంతో 20 డాలర్లకు పడింది. తర్వాత కాస్త పుంజుకున్నప్పటికి నేటికి 40 డాలర్ల కంటే తక్కువే ఉంది.

ముడిచమురు ధరలు ఇలా తగ్గుతుంటే.. దేశంలో పెట్రోల్.. డీజిల్ పెరుగుతున్న తీరు తెలిస్తే  షాక్ తినాల్సిందే. లాక్ డౌన్ నేపథ్యంలో దేశీయంగా ధరలు పెంచలేదు. ఎప్పుడైతే సడలింపులు మొదలయ్యాయో.. బాదుడు మొదలైంది. ఇటీవల కేంద్రం రెండుసార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచింది.

దీంతో లీటరుపెట్రోల్ పైన రూ.13.. డీజిల్ మీద రూ.10 చొప్పున పన్ను భారం పడింది. కేంద్రానికి తోడుగా కొన్ని రాష్ట్రాలు పన్నులు పెంచాయి. కేంద్రం పెంచిన ఎక్సైజ్ డ్యూటీ ప్రజల జేబుల మీద భారం పడదని చెబుతున్నా.. ఆ మాటల్లో నిజం లేదన్న విషయం దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.

ముడిచమురును శుద్ది చేసి మనం వాడే పెట్రోల్.. డీజిల్ మాదిరి తయారీ చేసిన తర్వాత ప్రజల వద్ద వసూలు చేసే ధరలకు పన్నుబాదుడు ఎంత భారీ అన్నది కేర్ రేటింగ్స్ అంచనాల్ని చూస్తే అర్థమవుతుంది. ఆ సంస్థ రేటింగ్ ప్రకారం ఫిబ్రవరి మొదటి నాటికి పెట్రోల్ మీద సుమారు 107 శాతం పన్ను పోటు ఉంటే..డీజిల్ మీద 69 శాతం పన్ను ఉండేది.

మార్చిలో పన్నులు పెంచిన తర్వాత పెట్రోల్ మీద 134 శాతంగా మారిన పన్నుపోటు డీజిల్ మీద 88 శాతంగా మారింది. మేలో రెండోసారి పన్నులు పెంచాక పెట్రోల్ మీద పన్నుపోటు 260 శాతం కాగా.. డీజిల్ మీద 256 శాతానికి చేరింది.

ఇంత భారీగా పన్నుబాదుడు బాదే దేశం కనిపించదని చెబుతారు. జర్మనీ.. ఇటలీ లాంటి దేశాల్లో ఈ బాదుడు 65 శాతానికి పరిమితమైతే.. బ్రిటన్ లో 64 శాతం.. జపాన్ లో 45 శాతమే. ఇక.. అమెరికాలో అయితే సుమారు 20 శాతమేనని చెబుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? తియ్యటి మాటలు చెప్పే మోడీ మాష్టారు పెట్రోల్ డీజిల్ మీద బాదే బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థమైందా?