చైనా సైనికుడి కంటి మీద కాల్చాను... తర్వాతేమైందంటే...

August 10, 2020

చైనాతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఇది యుద్ధానికి కూడా దారి తీయొచ్చన్న అంచనాలు మొదలయ్యాయి.

అయితే, చైనాతో యుద్ధవాతావరణం భారత్‌కు కొత్తేమీ కాదు.. గతంలో పలుమార్లు యుద్ధవాతావరణం ఏర్పడింది.. యుద్ధవాతావరణమేమిటి.. 1962లో ఏకంగా యుద్ధమే జరిగింది.

ఆ యుద్ధంలో పాల్గొని చైనా సైనికులను తన తుపాకీతో చంపిన తరువాత వారికి దొరికిపోయి యుద్ధ ఖైదీగా గడిపిన అప్పటి మేజర్ జనరల్ కేకే తివారీ ఆ నాటి యుద్ధాన్ని ఒక సందర్భంలో మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలివి...

‘‘అది చైనా, భారత్ మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయం. ‘‘1962 అక్టోబరు 19.. ఆ రోజు రాత్రి చైనా సైన్యం దాడి చేసి మా బంకర్‌లో ఉన్న టెలిఫోన్ తీగలన్నీ తెంచేసింది. దాంతో మేం మా మిలటరీ ప్రధాన కార్యాలయంలో కనెక్ట్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో చైనా బలగాలు ప్రతి బంకర్ వెతుకుతూ భారతీయ సైనికుల కోసం గాలిస్తున్నాయి. నేను, మరో ఇద్దరు సైనికులు అప్పటికి బంకర్ దగ్గర ఉన్నాం. చైనా సైనికులు ఎర్ర రంగు యూనిఫాం వేసుకుని కాల్పులు జరుపుతూ బంకర్ వైపు రావడం చూశాం. అంత ద‌గ్గ‌ర‌గా ఓ చైనా సైనికుణ్ని చూడ‌టం అదే తొలిసారి. మేం ఒక కొండ రాయి చాటున దాక్కున్నాం. ఆ చైనా సైనికుల బృందం మమ్మల్ని చూడకుండా వెళ్లిపోయింది. కానీ, అంతలోనే మరో టీం కాల్పులు జరుపుతూ వస్తోంది.. అంతేకాదు, బంకర్లపైకి బాంబులు విసురుతోంది. దాంతో ఇక మాకు చావు తప్పదని అర్థమై ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నాను. నాతో ఇద్దరు సిగ్నల్‌మెన్ మాత్రమే ఉన్నారు. అప్పుడు నా ద‌గ్గ‌ర 9ఎంఎం పిస్తోలు ఉంది. చనిపోయే ముందు చైనా సైనికులను ఆ 9 తూటాలకు బలి చేయాలనుకున్నాను. తుపాకీ వారిపై గురిపెట్టాను. వారిలో ఒక‌రికి ఎడ‌మ క‌న్నుపై తూటా త‌గిలింది. వెంటనే వాడు కింద‌ప‌డి దొర్లి చనిపోయాడు. ఇంకో సైనికుడి భుజంలో తూటా దించాను. వాడూ కిందపడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు.
నేను కాల్పులు జరపడంతో చైనా సైనికులు ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ మేం ఉన్న బంకర్‌పైకి దూసుకొచ్చారు. రైఫిల్ తిరగేసి న‌న్ను కొట్టారు.

బంక‌ర్ నుంచి బ‌య‌ట‌కు లాగి చిత‌క‌బాదారు. వారితోపాటు తీసుకెళ్లి ఒక చోట కూర్చోమన్నారు.

మూడు రోజుల వరకు మాకు తిండి కూడా పెట్టలేదు. ఆ తరువాత తిండిపెట్టి యుద్ధ ఖైదీల శిబిరానికి తీసుకెళ్లారు.
కొన్నాళ్ల తరువాత భారత ప్రభుత్వంతో ఒప్పందం జరిగిన తరువాత మమ్మల్ని ఇండియా పంపించారు’’ అని ఆయన అప్పట్లో 1962 యుద్ధం గురించి చెప్పారు.

సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి మన సైనికులు కన్నతల్లి వంటి మనదేశాన్ని రక్షిస్తున్నారు.

వారు దేశాన్ని రక్షించడమంటే మన ప్రాణాలను మాత్రమే కాదు మన ఆర్తిక వ్యవస్థను కూడా రక్షించడం అన్నమాట. 

వారంత కష్టపడుతున్నపుడు మనం చైనా వస్తువు మానేసి మన దేశపు వస్తువునో, మనకు మద్దతు ఇచ్చే వేరే ఏదైనా దేశపు వస్తువునో కొనచ్చు కదా.