కరోనా ట్విస్టు: తెలంగాణ అదృష్టం, ఇక్కడొకటే రకం !

August 11, 2020

మాయదారి మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. రోజుకో కొత్త అంశం బయటకు వస్తుంది. చైనాలోని వూహాన్ లో షురూ అయిన ఈ వైరస్ మహమ్మారికి ఉన్న లక్షణాల్లో మనిషిని మరింత ఇబ్బంది పెట్టేదేమంటే.. సమయానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవటం. దేశంలోకి ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వైరస్ లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు.

ఇదే విషయాన్ని తాజాగా జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన ప్రకారం.. మాయదారి వైరస్ ఇండియాలోకి అడుగు పెట్టిన తర్వాత మొత్తం 198 రకాలుగా మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ పిశాచి వైరస్ కు చెందిన 400 జన్యువుల్ని విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు.

దేశంలో అత్యధిక జన్యు మార్పులకు గురైన రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఆ రాష్ట్రంలో ఈ వైరస్ ఏకంగా 55 రకాలుగా మారినట్లుగా తేల్చారు. తెలంగాణకు మించి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అయితే.. మరో అడుగు ముందుకు వేసి.. ఏకంగా 60 రకాలుగా మారినట్లు గుర్తించారు. ఢిల్లీలో 39 రకాలుగా.. మహారాష్ట్ర.. కర్ణాటకల్లో 15 రకాలు చొప్పున మార్పులు చోటు చేసుకున్నాయి.

దేశంలోకి యూరప్.. చైనా నుంచి వ్యాపించిన రెండురకాల కరోనా వైరస్ ల కారణంగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇరాన్.. దుబాయ్ నుంచి వ్యాపిస్తున్న వైరస్ ల ప్రభావం భారత్ మీద తక్కువగా ఉందని.. ఇప్పుడు ప్రభావమంతా చైనా.. యూరప్ వైరస్ లతోనేనని తేల్చారు.

ఎప్పటికప్పడు తనను తాను మార్చుకుంటున్న ఈ మహమ్మారికి ముకుతాడు వేయటం అనుకున్నంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైరస్ రూపు మార్చుకోవటంపై తాజాగా వెలువడిన అధ్యయనం మరింత టెన్షన్ కు గురి చేస్తుందని చెప్పక తప్పదు.