ఇండియాకు ఛాన్స్ దొరికేసింది !

August 13, 2020

కరోనా ను ఇండియా ఇబ్బంది పెడుతున్న నొప్పి కంటే... కరోనా వల్ల ప్రపంచ దేశాలకు చైనాపై పెరిగిన ద్వేషం మనకు మేలు చేసే అవకాశం ఉందన్న సంతోషమే కేంద్రంలో ఎక్కువ కనిపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మన కేంద్ర మంత్రి పేర్కొనడం ఇంకా విశేషం. ’చైనాపై ప్రపంచంలో ద్వేష భావం పెరిగిన నేపథ్యంలో భారత్ కు ఇది అవకాశం అని, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున మనం ఆకర్షించగలుగుతామని‘ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. వివిధ దేశాల్లోని భారతీయ విద్యార్థులతో ఏర్పాుటచేసిన వీడియో కాన్పరెన్సులో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

నిజమే... మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. వాటంతటవే మనవద్దకు వస్తాయని సంబరపడితే సరిపోదు. మనకు పోటీగా కొన్ని దేశాలున్నాయి. మనకంటే తక్కువ వేతనాలకు పనిచేసే దేశాలున్నాయి. ఈ క్రమంలో సరైన సమయంలో తీసుకునే సరైన నిర్ణయాలు మనకు మేలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో కేంద్రం ఎంపికను ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. మన వాతావరణానికి, మన తరాలకు పెద్దగా హాని చేయని ఉత్తమ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టడం వల్ల పారిశ్రామికీకరణ నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. వ్యూహాత్మకంగా వ్యవహరించి కీలక పెట్టుబడులను మన వైపు మళ్లించే ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి.  అంతేకాదు, అందుకు అనుగుణంగా మన మానవ వనరులను సిద్ధం చేయడానికి ప్రణాళికను రచించాల్సిన అవసరం ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ లో మనం ఇంకా వెనుక పడి ఉన్నాయి. ఎంతో యువశక్తిని సరిగా వాడుకోకపోవడం వల్ల టాలెంట్ కంటే కూడా మనం లేబర్ ను ఎక్కువ సృష్టిస్తున్నాం. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం మన నాయకత్వానికి ఉంది.

మనది సమాఖ్య ప్రభుత్వం... కేంద్రం ఒక్కటే తలచుకుంటే అయ్యే పని కూడా కాదు ఇది. ఈ అవకాశాలపై రాష్ట్రాలు కూడా దృష్టి సారించి వ్యూహాలు రచించుకోవాలి. మన దగ్గర వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోగల బ్యూరోక్రాట్లకు కొరతేమీ లేదు. దానిని సమయోచితంగా గుర్తించి ముందుకు వెళ్లే రాష్ట్రాలు ఈ క్రమంలో ఎక్కువ బాగుపడతాయి. ఏ ముఖ్యమంత్రి యాక్టివ్ గా ఉంటారో దేశం అందుకునే అవకాశాలను వారు దక్కించుకోగలుగుతారు. స్థానిక ప్రాధాన్యాలపై దృష్టిపెడితే మనం చాలా కోల్పోయే ప్రమాదం ఉంది.