ఇన్నాళ్లకు ఆ మీటింగ్ పెట్టారబ్బా !!

May 24, 2020

ఏపీ విభజన ఒక రాచపుండులా మిగిలింది. విభజనతో కొత్త రాష్ట్రం బాగుపడటం అనేది మంచిదే. కానీ విభజనతో కొత్త రాష్ట్రం బాగుపడి... పాత రాష్ట్రం నిలువునా మునిగిపోవడం ఏంటో అర్థం కాని అయోమయ పరిస్థితి. సాధారణ సమస్యలను కూడా ఆరేళ్లుగా పెండింగ్ పెట్టి తెలుగు రాష్ట్రాలను కేంద్రం వేధిస్తోంది. ఏపీకి న్యాయం జరగడం పక్కన పెడితే.. ఆ రాష్ట్రం తెరచాప పడవలా ఎటు వీస్తే అటు పోతోంది. భవిష్యత్తు అనే గమ్యం ఎపుడు చేరుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా అనే మాటను ప్రధాని మోడీ చంపేశారు. అది వస్తుందో రాదో తెలియదు కాదు... మోడీ ఉన్నంత వరకు అయితే కచ్చితంగా రాదు. కానీ సమీప భవిష్యత్తులో మోడీ దిగిపోయే దాఖలాలు కూడా లేవు. 

ఇవన్నీ పక్కన పెడితే... తాజాగా తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి గుర్తుకు వచ్చాయి. ఏపీ పునర్విభజన చట్టంను కేంద్ర ప్రభుత్వం కదిలించింది. ఏపీ భవన్ మొదలుకుని ఇంకా విభజించని అనేక అంశాలపై ఆరాతీసింది. ఇద్దరు సీఎస్ లను పిలిపించుకుని లేటెస్ట్ అప్ డేట్ తెలుసుకుంది. 

షెడ్యూల్ 9, 10 జాబితాలోని సంస్థల విభజనపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ సాగింది. సింగరేణి, ఆర్టీసీ, సివిల్ సప్లయ్, విద్యుత్ సంస్థలు, కార్పొరేషన్ల విభజన అనేవి ముఖ్యాంశాలు కాగా... ఇప్పటికి మాత్రం వాటిపై వివరణలు తీసుకుని మమ అనిపించింది. ఈరోజు అయితే ఏమీ తేల్చలేదు. మరి ఈ సమాచారం ఆధారంగా త్వరలో ఏమైనా తేలుస్తారేమో చూడాలి. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలు ఎవరికి వారు తాము ఇవ్వాల్సిన వాటి గురించి వదులుకోవాల్సిన వాటి గురించి మారు మాటాడకుండా... రావల్సిన వాటిగురించి కూలంకుషంగా కేంద్రానికి వివరించారట. ఇంకో మీటింగ్ పెడితే బెటర్ అని డిసైడ్ అయ్యి ఈరోజు మీటింగ్ క్లోజ్ చేశారట. ఎన్ని మీటింగులుపెట్టినా ఫలితం మాత్రం తెలంగాణకు అనుకూలం, ఏపీకి వ్యతిరేకమేగా... ఆ మాత్రానికి సాగదీయడం ఎందుకో !!