మన దేశంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయా... !!

August 04, 2020

ఒక యాడ్ ఉంది.. ఏం నడుస్తోందీ అని ప్రశ్నిస్తే, ఫాగ్ నడుస్తోంది అని సమాధానం. ప్రస్తుతం దేశంలో అధికార, ప్రతిపక్షాలు, ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా, వివిధ రంగాలకు చెందినవారు.. ఇలా ఎక్కువగా చర్చిస్తున్న అంశాలు ఏమంటే.. భారత్-పాకిస్తాన్, ఆర్టికల్ 370 రద్దు, హిందూ-ముస్లీం, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్, షహీన్‌బాగ్.. ఇంతే. కానీ భారత్‌లో వీటికి మించి జరుగుతుందని మీకు తెలుసా? రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం కొన్ని అంశాలను తెరపైకి తెచ్చి, వాటిపై చర్చ జరిగేలా చేస్తాయి. దీంతో ప్రజలంతా నాణేనికి ఒకవైపు మాత్రమే చూస్తున్నారు. రెండో వైపు చూస్తే... భారత్ కుప్పకూలుతోంది.

ఇవి కాకుండా అసలు భారత్‌లో ఏం జరుగుతోంది. ఏం నష్టపోతోందో.. ఓసారి తెలుసుకుందామా..? ఇటీవలి డేటా ప్రకారం... 

భారత్ ఎక్స్టర్నల్ డెబిట్స్ 500కు పైగా బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఏజీఆర్ వంటి బకాయిల కారణంగా వొడాఫోన్ ఐడియా రూ.50 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఎయిర్‌టెల్ రూ.23 వేల కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.14వేల కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.755 కోట్లు, బీపీసీఎల్ రూ.750 కోట్లు, సెయిల్ రూ.286 కోట్లు, ఎయిరిండియా రూ.4600 కోట్లు, స్పైస్ జెట్ రూ.463 కోట్లు, ఇండిగో రూ.1,062 కోట్లు, బీహెచ్ఈఎల్ రూ.219 కోట్లు, ఇండియా పోస్ట్ రూ.15,000 కోట్లు, జీఎంఆర్ ఇన్ఫ్రా రూ.561 కోట్లు, యస్ బ్యాంకు రూ.600 కోట్లు, యూనియన్ బ్యాంక్ రూ.1,190 కోట్లు, PNB బ్యాంకు రూ.4,750 కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ.112 కోట్ల నష్టాల్లో ఉన్నాయి.

పై సంస్థలు నష్టాల్లో ఉంటే.. ఇంకొన్ని సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి లేక దివాళా తీశాయి. జేపీ గ్రూప్ పని అయిపోయింది. వీడియోకాన్ దివాళా తీసింది. రుణదాతలు వేల కోట్లు నష్టపోయారు. ఎయిర్‌సెల్, డొమాకో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ప్రస్తుతం టెలికం ఇండస్ట్రీలో బీఎస్ఎన్ఎల్‌ను పక్కన పెడితే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, జియో మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. కానీ వొడాఫోన్ ఐడియా పరిస్థితి కూడా ప్రస్తుతం బాగా లేదు. ప్రస్తుతం టెలికం రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.

విమాన రంగం విషయానికి వస్తే జెట్ ఎయిర్వేస్ మూతబడింది. ఇతర విమానయాన సంస్థలు అప్పుల్లో ఉన్నాయి. ఎయిరిండియా అప్పుల్లో మునిగిపోవడంతో ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ సంస్థలు ప్రయివేటీకరణ దిశగా నడుస్తున్నాయి. అదానీకి ఇప్పటికే 5 విమానాశ్రయాలను విక్రయించారు.

ప్రయివేటు రైళ్లు వచ్చేశాయి. ఢిల్లీ - లక్నో మధ్య ప్రయివేటు రైలు నడుస్తోన్న విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో కూడా వీటిని నడపనున్నారు. ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాలను అద్దెకు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. జాతీయ బ్యాంకులను విలీనం చేస్తున్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఎన్నో బ్యాంకుల శాఖలు మూతబడుతున్నాయి. ఏటీఎంల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బ్యాంకులు నష్టాలు చవిచూస్తున్నాయి.

బ్యాంకుల వద్ద అప్పులు చేసి దేశం విడిచి వెళ్లిపోయిన వారిలో మనకు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ మాత్రమే తెలుసు. కానీ అలా 36 మంది దేశం వదిలి పారిపోయారు. పెద్దలకు రూ.2.4 లక్షల కోట్ల రుణాలను ఎత్తివేశారు. బీఎస్ఎన్ఎల్‌లో వేలాది మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇటీవల మందగమనం నేపథ్యంలో ఆటో ఇండస్ట్రీలో దాదాపు పది లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. మందగమనం కారణంగా మారుతీ వంటి అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు సహా వివిధ కంపెనీలు తమ ప్రొడక్షన్‌ను తగ్గించాయి. రూ.55,000 కోట్ల కార్లు కర్మాగారాల వద్ద పడి ఉన్నాయి. కానీ డిమాండ్ లేక కొనుగోలు చేసేవారు లేకుండాపోయారు.

దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. ధరలు భారీగా పెరిగాయి. 30 ముఖ్య నగరాల్లో 12.76 లక్షల ఇళ్లు అమ్ముడు కాకుండా ఉండిపోయాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. జీఎస్టీ కారణంగా ఇంటి నిర్మాణాలు మరింత ఖరీదుగా మారాయి. అప్పుల బాధ తట్టుకోలేక గత ఏడాది కాఫీడే కంపెనీ ఓనర్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. HALలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు డబ్బులు కూడా లేని పరిస్థితి తలెత్తింది.

దేశంలోనే అత్యంత లాభదాయక కంపెనీ ఓఎన్జీసీ ఇప్పుడు నష్టాల ఊబిలోకి వెళ్లిపోతోంది. పార్లే-జీ, బ్రిటానియా వంటి కంపెనీల సేల్స్ తగ్గిపోయాయి. పార్లేజీ ఉద్యోగులను కూడా తొలగించే పరిస్థితి ఎదుర్కొంది. నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ దేశంపై కనిపిస్తోంది. ఈ కారణంగా లక్షలాది మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి ఎదురైంది. నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ద్రవ్యోల్భణం రికార్డులు సృష్టించింది. పెద్ద సంఖ్యలో HNI ఇండివిడ్యువల్స్ భారత్‌ను వదిలి వెళ్లిపోతున్నారు.

ఇంతేనా, తరిచి చూస్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికి మీడియాలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. మొక్కుబడిగా కవరేజ్ ఇస్తున్నట్లుగా ఉంది. పార్టీలు, నాయకులు మాత్రమే కాదు.. మీడియా కూడా భారత్ - పాకిస్తాన్, హిందూ-ముస్లిం వంటి అంశాల పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. కానీ దేశంలో ఈ అంశాలు మాత్రమే కాదని.. ఇంకా ఎంతో జరుగుతోందని అందరికీ తెలిజేయవలసిన కర్తవ్యం మనపై ఉంది.