యాపిల్ చైనాకు దూరం, ఇండియాకు దగ్గర?

August 05, 2020

యాపిల్ చైనాకు గుడ్ బై చెప్పనుందా? అవుననే తెలుస్తోంది. అయితే... దశలవారిగా అక్కడ ఉత్పత్తిని తగ్గించనుంది. ఒకేసారి తీసేయడం వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి యాపిల్ ఈ మార్గాన్ని ఎంచుకుంది. మరి తన తదుపరి గమ్యం ఎక్కడ అని ఆలోచించినపుడు యాపిల్ మదిలో మన దేశమే కదిలింది.

భారతదేశంలో యాపిల్ తన తయారీ విభాగాన్ని ఏర్పాటుచేయనుంది. అయితే, భారత ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటును బట్టి ఎంత సామర్థ్యం మేర ఇక్కడ ఏర్పాటుచేయాలనేది నిర్ణయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మనకొచ్చే ఐఫోన్లలో టెక్నాలజీ యాపిల్ కంపెనీదే గాని...దాని పార్టులు తయారై ఒక రూపుదాల్చేది చైనా ఫ్యాక్టరీలలో. ఇక నుంచి ఆ ఫ్యాక్టరీలు ఇండియాలో నెలకొల్పుతారన్నమాట. 

యాపిల్ వంటి ప్రముఖ సంస్థలు మన దేశానికి వస్తే... ఉపాధి అవకాశాలు, మౌళిక సదుపాయాలు పెరుగుతాయి. కానీ ఆ మేర కాలుష్యం పెరిగే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుతం చైనాలో యాపిల్ త‌ర‌పున ఫాక్స్‌కాన్‌, విస్ట్ర‌న్ సంస్థ‌లు స్మార్ట్‌ఫోన్ల‌ను త‌యారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు  ఏపీని స్మార్ట్ తయారీ హబ్ గా మార్చారు. కాబట్టి అనువైన వాతావరణం ఉన్న నేపథ్యంలో యాపిల్ కూడా ఏపీ వైపు చూసే అవకాశాలున్నాయి. అయితే, అక్కడి పాలకులను బట్టి ఇది నిర్ణయం కానుంది. 

ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటికే ఇక్కడ యాపిల్ ఫోన్లు తయారవుతున్నాయి గాని ఇండియన్ స్మార్ట్‌ఫోన్ ఇండ‌స్ట్రీలో యాపిల్ వాటా త‌క్కువే. ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్ ఫోన్లను ఇండియాలోనే త‌యారు చేస్తున్నారు. గ‌తంలో ఎస్ఈ, 6ఎస్ ఫోన్ల‌ను ఉత్ప‌త్తి చేసేవారు. ఇప్పుడు వాటిని నిలిపేశారు. యాపిల్ అంటే ఐఫోన్లే కాదు... ఇంకా అనేక ఉత్పత్తులున్నాయి. పీసీలు, ల్యాప్ టాప్ లు, స్పీకర్లు వంటి అనేక ఉత్పత్తులను యాపిల్ తయారుచేస్తోంది.