ఐరాస చెప్పింది... నా దేశం సేఫ్ !!

August 15, 2020

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ విలవిలలాడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలతో పాటు అభివృద్ధలో దూసుకుపోతోన్న అగ్రరాజ్యం అమెరికా వరకు కరోనా బారిన పడి అతలాకుతలమయ్యాయి. కరోనా ప్రభావంతో విధించిన లాక్ డౌన్ వల్ల ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా బారిన పడిన దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనవలసి రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మాంద్యంలోకి నెట్టివేసిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అంచనా వేసింది. ఈ ఆర్థిక విపత్తు నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకునేందుకు 2.5 ట్రిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్‌సిటిఎడి) కాన్ఫరెన్స్‌ అంచనా వేసింది. `అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్‌-19 షాక్‌’ పేరుతో ఐరాస విడుదల చేసిన నివేదికలో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అయితే, ఆశ్చర్యకరంగా ఆ జాబితాలో భారత్, చైనాలకు మినహాయింపు దక్కింది.

ఎక్కువగా వినియోగ వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే  రెండు నుంచి మూడు ట్రిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని ఐరాస అంచనా వేసింది. ఆరోగ్య సంక్షోభం, ఆర్థిక సంక్షోభం రెండూ కలిసి వస్తే ఆయా దేశాలు ఆర్థిక కష్టాలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చితే, చైనా, భారత్ మినహా  అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుందని వెల్లడించింది. దానిని అరికట్టాలంటే రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2-3 ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని కేటాయించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. 4 పాయింట్ల రికవరీ ప్రణాళికతో ఆయా దేశాలు పుంజుకోవచ్చని ప్రకటించింది. 2009 కేటాయింపులకు మించిన ఆర్థిక కేటాయింపులు, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు రుణాల రద్దు, పేద దేశాల్లో అత్యవసర ఆరోగ్య సేవకు 500 బిలియన్ల పెట్టుబడులు,మూలధన ప్రవాహ నియంత్రణ వంటి చర్యల ద్వారా పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశముందని తెలిపింది.