సంక్షోభాల నుంచి అవకాశాలు దొరకబుచ్చుకునే నాయకుడు కావాలి ఇప్పుడు

June 06, 2020
కరోనావైరస్ దెబ్బకు 2020-21లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కనీసం 9 ట్రిలియన్ డాలర్ల నష్టమేర్పడుతుందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ అంచనా వేశారు. అంటే.. 9 లక్షల కోట్ల డాలర్ల నష్టం.
గతంలోనూ ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఆ ప్రభావానికి గురయ్యాయి. కానీ, ఇప్పుడు దాదాపుగా ప్రతి దేశమూ కరోనా దెబ్బకు దొరికి విలవిలలాడుతోంది. ప్రపంచం గతిశీలమైనది... నిశ్చలంగా ఉంటే ఉత్పత్తి ఉండదు, సంపద ఉండదు. ఇప్పుడు అలాంటి నిశ్చల స్థితే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఉత్పత్తులు, సేవలు, వినిమయం అన్నీగరిష్ఠ స్థాయిలో నిలిచిపోయాయి.. ఫలితంగా సంపద సృష్టి, ద్రవ్య మార్పిడి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇది వ్యక్తిగత స్థాయి నుంచి వ్యవస్థ స్థాయి దాటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వరకు వృద్ధిరేటును అమాంతం పడేసింది.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభంతో పోల్చితే 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభాలు వంటివి గాలి బుడగలేనని.. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇలాంటి సంక్షోభం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇలాంటి సంక్షోభాల నుంచి అవకాశాలు వస్తాయని.. అలాంటి అవకాశం భారత్ ముందున్నదని.. కావాల్సిందంతా సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోగలిగే సత్తా, నిబద్ధత ఉన్న నాయకత్వమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ముందుచూపు, ఆర్థిక శాస్త్రంలో లోతైన అవగాహన.. పాలన, సంపద సృష్టి, అవకాశాల సృష్టిలో విశేష అనుభవం ఉన్న నాయకత్వమే. ప్రస్తుత దేశ నాయకత్వ సామర్థ్యంపై అనుమానాలు లేకపోయినా అలాంటి అనుభవం తక్కువేనన్నది విశ్లేషకులు, ఆర్థిక నిపుణుల మాట.
ఈ నేపథ్యంలో దేశంలో, ఇతర దేశాల్లోని ఆర్థిక మేధావులు కొందరి నోట చంద్రబాబునాయుడి పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడంలో... ప్రపంచవ్యాప్త పరిణామాలను గమనిస్తూ భవిష్యత్తులో ఎలాంటి రంగాలు సంపదను, అవకాశాలను సృష్టిస్తాయో అంచనా వేసి ఆ రంగాన్ని రాష్ట్రంలో విస్తరించడంలో చంద్రబాబుకు ప్రూవెన్ రికార్డ్ ఉంది. చంద్రబాబు భారత్‌లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రే అయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సదస్సులో అనేకసార్లు పాల్గొని తన విలువైన ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలను ఆకట్టుకున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు చంద్రబాబు పేరు అక్కడక్కడా వినిపిస్తోంది.
ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూడు ప్రధాన వర్గాలుగా చూస్తే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు/దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలుగా కనిపిస్తాయి. ఈ సంక్షోభం ఈ మూడు క్యాటగిరీల్లోని దేశాలపైనా ప్రభావం చూపింది. అన్ని దేశాల జీడీపీ వృద్ధి రేటు ఇప్పటికే పాతాళానికి చేరింది.
ఆర్నెళ్లకో, సంవత్సరానికో ఈ వైరస్ విపత్తు నుంచి బయటపడిన తరువాత అసలు కథ మొదలవుతుంది. ఇప్పటికే రాజుకున్న అమెరికా, చైనా ఆర్థిక యుద్ధం కొత్త మలుపులు తీసుకోవడం ఖాయం. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు అమెరికా, చైనాలకు ప్రత్యామ్నాయాలను వెతుక్కునే పనిలో పడతారు. వ్యక్తిగత, సంస్థల స్థాయిలో ప్రధానంగా చెప్పే ఆర్థిక సూత్రాల్లో ఒకటైన సింగిల్ సోర్స్ ఉండరాదన్న నియమాన్ని ఆచరించడానికి చాలా దేశాలు త్వరపడతాయి. ఇప్పుడు అనేక దేశాలు, అనేక రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, సేవల కోసం ప్రధానంగా అమెరికా, చైనాలపై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు కరోనా నేర్పిన పాఠాలతో అంతా ప్రత్యామ్నాయాల వైపు చూస్తారు. ప్రత్యామ్నాయాలు లేకుంటే ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు కల్పిస్తారు. విషయమంతా ఆ అవకాశాలు ఎవరికి దక్కుతాయి.. ఎవరు దక్కించుకుంటారన్నదే. అవకాశాలు దక్కించుకునే రేసులో భారత్ ముందువరుసలో ఉంటుందనే చెప్పాలి. అందుకు కారణం.. ప్రస్తుతం దౌత్యపరంగా భారత్ మంచి స్థితిలో ఉండడం ఒక కారణమైతే.. రెండోది పెద్ద సంఖ్యలో మానవ వనరుల లభ్యత. ఇక ఆ మానవ వనరుల్లో అధిక శాతం పనిచేసే వయసులో ఉండడం.. ఇతర దేశాలతో పోల్చితే చవగ్గా లభిస్తుండడం అనేది అదనపు అవకాశం.
ముఖ్యంగా ప్రస్తుతం తయారీరంగానికి తాత అని చెప్పుకొంటున్న చైనాపై ఆధారపడడం చాలా దేశాలు తగ్గించుకుంటాయి. అక్కడ పెట్టుబడులు పెట్టినవారు ఇతర దేశాలవైపు చూస్తారు. మూడు వైపులా సముద్రం ఉండడంతో పాటు, ఎయిర్ కనెక్టివిటీ ఉంటూ ప్రపంచంలో అన్ని వైపులకూ సమాన దూరంలో ఉండడంతో పాటు, చైనాతో సమానంగా మానన వనరులు అందుబాటులో ఉండడం వంటి లక్షణాల వల్ల చైనాను వీడే పెట్టుబడిదారుల తొలిచూపు భారత్ పైనే పడుతుంది. చేయాల్సిందంతా ఆ చూపులను పట్టుకోవడమే.
ఇక వ్యవసాయం వంటి సంప్రదాయ రంగాలు ఇంకా బలంగా ఉండడం వల్ల భారత్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి వేగంగా కోలుకునే దేశాల్లో ఒకటిగా నిలుస్తుంది.
2009 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని భారత్ చైనాలు తట్టుకుని నిలిచాయి. అమెరికా, యూరోజోన్, జపాన్ దారునంగా దెబ్బతిన్నప్పటికీ చైనా, భారత్‌లు నిలదొక్కుకోగలిగాయి. ఇప్పుడు తాజా సంక్షోభంలో గతంలో మాదిరిగానే అమెరికా, యూరోజోన్ దేశాలు ,జపాన్ దెబ్బతింటాయని అంచనావేస్తున్నారు. చైనా కొంతవరకు, భారత్ దాని కంటే మెరుగ్గా తట్టుకుంటాయని అంచనావేస్తున్నారు. అయితే.. 2009తో పోల్చితే భారత్‌పైనా ఈ ప్రభావం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనావేసింది.
మిగతా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ నేల చూపులు చూస్తున్న వేళ ఎంతోకొంత తలెత్తుకునే పరిస్థితుల్లో ఉండబోతున్న భారత్ ఆ పరిస్థితిని సరిగ్గా ఉపయోగించగలగాలి. అలా ఉపయోగించుకోవాలంటే ఆర్థికశాస్త్రవేత్త స్థాయి ఆలోచనలున్న నాయకుడు అవసరం. అది ఆంధ్రప్రదేశ్‌కైనా, భారతదేశానికైనా.