సెంటిమెంట్ ఏడోసారి గెలిచింది

July 12, 2020

పూజ‌లు ఫ‌లించాయి. కోట్లాది మంది ఆశ‌లు నెర‌వేరాయి. అంత మంది కోరిక‌ను వ‌రుణుడు సైతం కాద‌న‌లేకపోయాడు. అందుకే తాను కాస్తంత త‌గ్గి భార‌త్ - పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగేలా చేశారు. అలా అని పూర్తిగా వ‌దిలేస్తే త‌న గురించి ఎవ‌రు మాట్లాడుకుంటార‌ని అనుకున్నారేమో కానీ.. మ‌ధ్య మ‌ధ్య‌లో తానేంటో చూపిస్తూ.. అంత‌లోనే కాస్త నెమ్మ‌దించి మొత్తానికి మ్యాచ్ జ‌రిగేలా చేశారు. 
ఇదిలా ఉంటే.. ప్ర‌పంచ‌క‌ప్ లో దాయాది మీద భార‌త్ క‌చ్ఛితంగా గెలుస్తుంద‌నే సెంటిమెంట్ మ‌రోసారి రుజువైంది. వ‌రుస‌గా ఏడోసారి ప్ర‌పంచ‌క‌ప్ లో దాయాదిని క‌సి తీరా ఓడించిన టీమిండియా ప్ర‌తిభ‌.. వంద కోట్ల‌కు పైగా భార‌తీయుల్ని సంతోషంలో ముంచింది. బ‌ల‌బ‌లాల విష‌యంలో టీమిండియాకు సాటి రాని పాక్ జ‌ట్టును కోహ్లీ సేన క‌సి తీరా ఆడుకుంది. 
టాస్ గెలిస్తే క‌చ్ఛితంగా బ్యాటింగ్ చేయాలంటూ పాక్ ప్ర‌ధాని క‌మ్ మాజీ క్రికెట‌ర్ అయిన ఇమ్రాన్ సూచ‌న‌ను పెడ చెవిన పెట్టిన పాకిస్తాన్ కెప్టెన్ స‌ర్ప‌రాజ్.. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. టాస్ గెలిచిన‌ప్ప‌టికీ టీమిండియాకు బ్యాటింగ్ అప్ప‌జెప్పి.. మ్యాచ్ ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని తొలి ప‌ది ఓవ‌ర్ల‌లోనే అర్థ‌మ‌య్యేలా చేశారు.
వికెట్ ప‌డ‌కుండా భారీ స్కోర్ మీద దృష్టి సారించిన టీమిండియా తాను అనుకున్న ల‌క్ష్యం దిశ‌గా ప‌య‌నించింది. మొద‌టి రెండు వికెట్లు ప‌డేస‌రికి.. భార‌త్ స్కోర్ భారీగా ఉండ‌ట‌మే కాదు.. త‌క్కువ‌లో త‌క్కువ 350 స్కోర్ దాకా వ‌స్తార‌న్న‌ట్లుగా ఉంది. అయితే.. చివ‌రి ఓవ‌ర్ల‌లో వికెట్లు ట‌ప‌ట‌పా ప‌డ‌టం.. ధోనీ దారుణంగా విఫ‌లం కావ‌టంతో టీమిండియా స్కోర్ 50 ఓవ‌ర్ల‌కు ఐదు వికెట్ల న‌ష్టానికి 336 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. 
ఒక‌వేళ ధోనీ త‌క్కువ ప‌రుగుల‌కు ఔట్ కాకుంటే స్కోర్ మ‌రో ర‌కంగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ భారీ స్కోర్ కు రోహిత్ శ‌ర్మ కార‌ణంగా చెప్పాలి. త‌న రెండో శ‌త‌కంతో పాక్ బౌల‌ర్ల‌ను క‌సితీరా ఆడుకున్న అత‌గాడు డ‌బుల్ సెంచ‌రీ సాధిస్తాడ‌ని చాలామంది ఆశ‌లు పెట్టుకున్నా.. అది సాధ్యం కాలేదు.
భారీ స్కోర్ ను ఛేదించేందుకు రంగంలోకి దిగిన పాక్ జట్టు ఆది నుంచి త‌డ‌బాటు త‌ప్ప‌లేదు. మొద‌టి రెండు వికెట్లు త‌క్కువ స్కోర్ కే ప‌డిపోవ‌టంతో ఆ జట్టు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. కెప్టెన్ స‌ర్ప‌రాజ్ పోరాటం చేసినా.. అత‌డి వికెట్ త్వ‌ర‌గా చేజార్చుకోవ‌టంతో పాక్ ప‌రాజ‌యం క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. దీనికి తోడు రావొద్ద‌న్న వ‌రుణుడు మ‌ధ్య‌లో వ‌చ్చేయ‌టం.. మ్యాచ్ ఆగిపోవ‌టం కార‌ణంగా 50 ఓవ‌ర్ల‌ను కాస్తా 40 ఓవ‌ర్ల‌కు కుదించారు.
డ‌క్ వ‌ర్త్ లూయిస్ నిబంధ‌న‌లో భాగంగా 40 ఓవ‌ర్ల వ్య‌వ‌ధిలో భారీ స్కోర్ ను ఛేదించాల్సి వ‌చ్చింది. అయితే.. వ‌రుస పెట్టి వికెట్లు పోవ‌టంతో పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయిన పాక్ కు కేవ‌లం ఐదు ఓవ‌ర్ల‌లో 136 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. అయితే.. ఆ జ‌ట్టు కేవ‌లం 46ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. మొత్త‌మ్మీదా మాంచ‌స్ట‌ర్ లో పాక్ మీద భార‌త్ గెలుపు భార‌తీయుల‌కు ప్ర‌పంచ‌క‌ప్ సొంతం చేసుకున్నంత ఆనందం క‌లిగింద‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు.