ఇండియా: మనం ఎంత డేంజర్లో ఉన్నామో చెప్పే డేటా

August 13, 2020

ఇతరులతో పోలిస్తే లాక్ డౌన్ విధించడంలో భారతదేశం శరవేగంగా నిర్ణయం తీసుకుని అందరితో శభాష్ అనిపించుకుంది.  కానీ... ఆ లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైందని తాజా కేసులు చెబుతున్నాయి. లాక్ డౌన్ లోనే మహారాష్ట్రలో 20 వేల కేసులు వచ్చాయి. రోజుకు వెయ్యి చొప్పున వస్తున్నాయి. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. 

లాక్ డౌన్ విధించే సమయానికి అక్కడ కొందరికి ఇన్ఫెక్ట్ అయ్యిందనుకుందాం... అవన్నీ ఏప్రిల్ 14 నాటికి అన్నీ బయటపడాలి. కానీ మే 14 నాటికి కూడా కేసులు పెరుగుతున్నాయంటే.. లాక్ డౌన్ అమలులో మహారాష్ట్రలో నియంత్రణ కొరవడింది. కేసులు ఉన్నవారు ఇతరులను కలిశారు. ఇది ఎలా జరిగింది. అది కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ ఫెక్షన్లు రావడం మామూలు విషయం కాదు. 

ఆర్థిక రాజధానిలో పరిస్థితి ఇంత శృతి మించే వరకు కేంద్రం చోద్యం చూడటం సరైనది కాదు. కరోనాను పూర్తిగా పోగొట్టలేం కానీ కేసులు సంఖ్యను బాగా తగ్గించే మార్గాలైతే ఉన్నాయి. కానీ వాటిని అమలుచేయడంలో రాష్ట్రం, కేంద్రం విఫలం అయ్యాయి. గుజరాత్ లోను ఇదే పరిస్థితి. కర్ణాటక, కేరళ, తెలంగాణ కేసులను కంట్రోల్ చేయడంలో విజయవంతం అయ్యాయి. 

ఇక పోతే ప్రపంచంలో కరోనా కేసుల్లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. కొత్త కేసుల నమోదులో 4వ స్థానానికి చేరింది. ఆ డేటా ఒకసారి పరిశీలిద్దాం.

నేటి వరకు ప్రపంచంలో మొత్తం కేసులు - 42 లక్షలు

అమెరికాలో మొత్తం కేసులు  13 లక్షలు - కొత్త కేసులు 20 వేలు

రష్యాలో మొత్తం కేసులు 2.20 వేలు - కొత్త కేసులు 11 వేలు

బ్రెజిల్ లో  మొత్తం కేసులు  1.62 వేలు - కొత్త కేసులు 6600 

ఇండియా మొత్తం కేసులు  67వేలు - కొత్త కేసులు 4353 

మొదట్లో 10-20 కొత్త కేసులు నమోదయ్యే స్టేజి నుంచి సరిగ్గా 100 రోజుల్లో రోజుకి 4 వేలకు పైగా కేసులు నమోదు కావడం అంటే ఎంత తీవ్రంగా కరోనా మన దేశంలో విస్తరించిందో అర్థమవుతోంది. పైగా అత్యధిక కేసులు నమోదయ్యే దేశాల్లో మనం 4వ స్థానంలో ఉండటం కచ్చితంగా ప్రమాదకరమైన సంఖ్యగా చెప్పొచ్చు. 

ఎక్కడో తప్పు జరుగుతోంది...

డేటా చూస్తే తెలిసి తెలిసి మనదేశాన్ని మనం మూడో స్టేజీలోకి తీసుకెళ్లాం. ఎక్కడో తప్పు జరుగుతోంది. అదెక్కడనేది అర్థం కాని పరిస్థితి. స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు దీనిని అరికట్టడానికి వేసిన ప్రణాళికల్లో లోపాలున్నాయి. అందుకే విస్తరణ ఈ స్థాయిలో ఉంది. దీన్ని బట్టి మన ప్రణాళికలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత వేగంగా వ్యాప్తిని అరికట్టకపోతే కరోనా కంటే పెద్ద ప్రమాదం ఆర్థిక సంక్షోభం రూపంలో రానుంది.