మోదీ స‌ర్కారుకు షాక్‌.. 

August 14, 2020

కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుకు ఊహించ‌ని షాక్‌. గ‌త రెండు ద‌శాబ్ధాల్లో వ‌సూళ్లు అయిన‌దానితో పోలిస్తే  కార్పొరేట్‌, ఆదాయ‌ప‌న్ను వ‌సూళ్లు ఈ ఏడాది దారుణంగా ప‌డిపోయాయి.  ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు సుమారు 13.5 ల‌క్ష‌ల కోట్ల ఐటీ వ‌సూళ్లు చేయాల‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వం భావించింది. కానీ ఐటీ రాబ‌డి మాత్రం ఊహించిన దాని క‌న్నా త‌క్కువ‌గా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.  ఈ విష‌యాన్ని త‌మ పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని సీనియ‌ర్ అధికారులు పేర్కొంటున్నారు.
జ‌వ‌న‌రి 23వ తేదీ వ‌ర‌కు కేవలం 7.3 ల‌క్ష‌ల కోట్ల ఐటీ ఆదాయం వ‌సూలైన‌ట్లు ఆ శాఖ అధికారులు వెల్ల‌డించారు.  గ‌త ఏడాదితో పోలిస్తే ఇది 5.5 శాతం త‌క్కువ అని అధికారులు చెప్పారు. కార్పొరేట్ ప‌న్ను రేట్ల‌ను త‌గ్గించ‌డం వ‌ల్ల .. ఐటీ రాబ‌డి మంద‌గించిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఇర‌వై సంవ‌త్స‌రాల్లో ఇంత త‌క్కువ ప‌న్ను వ‌సూలు జ‌ర‌గ‌లేద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవ‌త్సరానికి ప్ర‌త్య‌క్ష పన్ను వసూళ్లు మ‌రీ ఎక్కువ‌గా త‌గ్గ‌నున్న‌ట్లు తెలిసింది.  గ‌త ఏడాదితో పోలిస్తే.. డైర‌క్ట్ ట్యాక్సులు.. ప‌ది శాతం త‌క్కువ వ‌సూల్ కానున్నాయి.
ఇదిలాఉండ‌గా, సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ప‌న్ను వ‌సూలుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధిక స్థాయిలో ప‌న్నులు వ‌సూల్ చేయ‌డం అంటే.. ప్ర‌భుత్వం సామాజిక అన్యాయానికి పాల్ప‌డ‌డ‌మే అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జ‌రిగిన‌ ఇన్‌కం ట్యాక్స్ అప్పిల్లేట్ ట్రిబ్యున‌ల్ 79వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో సీజే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, కొంద‌రు ప‌న్నులు ఎగ‌వేస్తే, అది మ‌రికొంద‌రికి అన్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌ని, అధిక స్థాయిలోనూ ప‌న్నులు వ‌సూల్ చేయ‌డం అన్యాయ‌మే అని సీజే అన్నారు. పౌరులపై ప‌న్ను పోటు ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు.