మెన్ ఇన్ బ్లూ వ‌ర్సెస్ మెన్ ఇన్ బ్లాక్..!

August 08, 2020

వ‌రల్డ్ క‌ప్ క్రికెట్ టోర్నీ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. లీగ్ ద‌శ ముగిసి సెమీస్ మీద క్లారిటీ వ‌చ్చేసింది. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కూ తాను ఆడిన మ్యాచుల్లో ఒకే ఒక్క మ్యాచ్ త‌ప్పించి.. అన్ని మ్యాచుల్లో విజ‌యాన్ని సొంతం చేసుకున్న టీమిండియా ఇప్ప‌టికే సెమీఫైన‌ల్ బెర్త్ ను ఖ‌రారు చేసుకోవ‌టం తెలిసిందే. సెమీస్ లో టీమిండియా ఎవ‌రి మీద ఆడాల‌న్న విష‌యం మీద ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది.
టోర్నీ చివ‌రి లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా - సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో అనూహ్యంగా ఆసీస్ జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా చేతిలో ఓడింది. దీంతో.. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో సెమీస్ లో త‌ల‌ప‌డ‌నుంది. అదే స‌మ‌యంలో రెండోస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జ‌ట్టు మూడోస్థానంలో ఉన్న అతిధ్య జ‌ట్టు ఇంగ్లాండ్ లో అమీతుమీ తేల్చుకోనుంది.
శ‌నివారం ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్ లో ఆసీస్ మీద ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 10 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే 1992 త‌ర్వాత ప్ర‌పంచ క‌ప్ టోర్నీలో ఆస్ట్రేలియా జ‌ట్టుపై ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు గెల‌వ‌టం ఇదే తొలిసారి. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 325 ప‌రుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (100).. వాండ‌ర్ డ‌సెస్ (95) ప‌రుగులతో రాణించ‌టంతో భారీ స్కోర్ కు అవ‌కాశం ఏర్ప‌డింది.
భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే విష‌యంలో ఆసీస్ త‌డ‌బ‌డింది. 122 ప‌రుగుల‌తో వార్న‌ర్.. 85 ప‌రుగుల‌తో కేరీ పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. 49.5 ఓవ‌ర్ల‌లో 315 ప‌రుగుల‌కు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. దీంతో.. అద్భుత విజ‌యం ద‌క్షిణాఫ్రికా సొంత‌మైంది.కానీ.. సెమీస్ లో చోటు ద‌క్కించుకోలేక‌పోయింది. తాజాగా ముగిసిన మ్యాచుల‌ నేప‌థ్యంలో సెమీస్ లో ఏ జ‌ట్టు ఎవ‌రితో త‌ల‌ప‌డ‌నుంద‌న్న విషయంపై క్లారిటీ వ‌చ్చేసింది.
మంగ‌ళ‌వారం జ‌రిగే సెమీస్ లో టీమిండియా వ‌ర్సెస్ కివీస్ త‌ల‌ప‌డుతుండ‌గా.. రెండో సెమీస్ (జులై 11న‌) లో అతిథ్య ఇంగ్లండ్‌-ఆసీస్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. వ‌రల్డ్ క్రికెట్ లో భార‌త్-పాక్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కు ఎంత ప్రాధాన్య‌త ఉంటుందో.. ఆ త‌ర్వాత అంటే శ‌త్రుత్వం ఉన్న జ‌ట్లుగా ఇంగ్లండ్-ఆసీస్ పేరుంది. తాజాగా ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య సెమీస్ పోరు ఓరేంజ్ లో సాగ‌నుంద‌ని చెప్పాలి.
క్రికెట్ పుట్టింది ఇంగ్లండ్ లో అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌సారిగా ప్ర‌పంచ క‌ప్ విజేత‌గా ఆవ‌త‌రించ‌ని ఇంగ్లండ్ జ‌ట్టు ఈసారి త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియా మీద నెగ్గి ఫైన‌ల్ కు దూసుకొచ్చి.. వ‌ర‌ల్డ్ క‌ప్ మీద ఆశ‌ల్ని స‌జీవంగా ఉంచుతుందా? లేక‌.. మ్యాచ్ చేజార్చుకుంటుందా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఇక‌.. మ‌రో సెమీస్ లో మెన్ ఇన్ బ్లూ వ‌ర్సెస్ మెన్ ఇన్ బ్లాక్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో అద్భుతమైన ఆట‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న టీమిండియా సెమీస్ లో మ‌రోసారి స‌త్తా చాటి ఫైన‌ల్ పోరుకు దూసుకెళ్ల‌నుందా? అన్న‌ది మ‌రో రెండు రోజుల్లో తేల‌నుంద‌ని చెప్పాలి.