ఇది చదివి... మోడీ మొనగాడో, అసమర్థుడో మీరు తేల్చాలి మరి

August 07, 2020

మోదీ పాలనలో దేశం కునారిల్లుతోంది.. ప్రగతి మందగిస్తోంది అంటూ ఓ వాట్సాప్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందంటూ అందుకు ఇరవై ఒక్క కారణాలను పేర్కొంటూ ఆ మెసేజ్ వాట్సాప్‌లో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. బిజెపి వ్యతిరేక సోషల్ మీడియా వర్గాల నుంచి ఇది ఎక్కువగా షేర్ అవుతోంది.
జెట్ ఎయిర్‌వేస్ మూతపడటం, ఎయిరిండియా విపరీతమైన నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు పలు ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని.. ఇవన్నీ దేశం వెనక్కు పోతుందనడానికి నిదర్శనమని.. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడిందనడానికి సూచికలని ఇందులో పేర్కొన్నారు.
బిఎస్ఎన్ఎల్ లో 54 వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి.. మరో ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి ఉంది..పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా 15 వేల కోట్ల రూపాయల నష్టం లో కూరుకుపోయిందని ఇందులో చెప్పుకొచ్చారు. దీంతో పాటు మరికొన్ని ప్రైవేటు రంగ సంస్థలు నష్టాల్లో ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు వీడియోకాన్ సంస్థ పూర్తిగా దివాలా తీసిందని.. టెలికాం సంస్థ టాటా డొకోమో కూడా మునిగిపోయిందని.. ఎయిర్సెల్ మనుగడ లేకుండా పోయిందని, జేపీ గ్రూప్ పనైపోయిందని కూడా రాసుకొచ్చారు.
అలాగే ఓఎన్జీసీ పనితీరు అత్యంత దారుణంగా ఉందని, దాని వల్ల లాభాలు ఏమి లేవని కూడా ఇందులో ప్రస్తావించారు. దేశంలోని 36 మంది బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని దేశం విడిచి పారిపోయారని.. మూడున్నర కోట్ల మందికి రుణాలు దక్కలేదని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, ఇతర బ్యాంకులు కూడా నష్టాల్లో ఉన్నాయని, దేశం నెత్తిన లక్షా 31 వేల ఒక వంద అమెరికన్ డాలర్ల రుణం ఉందని ఇందులో ప్రస్తావించారు. రైల్వేలు అమ్మకానికి పెట్టారని, ఎర్ర కోట లాంటి హెరిటేజ్ స్థలాలు కూడా అధిక ఇచ్చేశారని, నోట్ల రద్దు తర్వాత లక్షల మంది ప్రజలకు ఉద్యోగాలు పోయాయని గత నలభై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరుద్యోగ రేటు పెరిగి పోయిందని ఇందులో పేర్కొన్నారు అలాగే గత ప్రభుత్వాల హయాంలో పోలిస్తే మోడీ పాలనలో అమరవీరుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని.. అదానీకి 5 ఎయిర్పోర్టులు అమ్మేశారని కూడా ఇందులో ఉంది.
అయితే ఈ మెసేజ్ లో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. జెట్ ఎయిర్వేస్ మూతపడడం అనేది అందరికీ తెలిసిందే. ఇది వాస్తవమే.. అలాగే ఎయిరిండియా నష్టాల్లో ఉన్నది కూడా వాస్తవమే. బిఎస్ఎన్ఎల్ 54 వేల ఉద్యోగాలు కొంచెం తేడా ఉండొచ్చు కానీ ఇందులో కూడా కొంత వాస్తవం ఉంది. రైల్వేలను అమ్మకానికి పెట్టారు అనేది పూర్తిగా అవాస్తవం. రైల్వే ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం కొంత వరకు వెళుతుంది కొన్ని స్టేషన్లను కొన్ని రైళ్లను ప్రైవేటు సంస్థలు వ్యక్తులకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తోంది. అంతేగాని రైల్వేల అమ్మకం అనేది లేదు. దిల్లీలో ఉన్న ఎర్రకోటను అద్దెకిచ్చారన్నదీ అవాస్తవమే. ఎర్రకోటలో మరమ్మతులు, సొబగుల పనుల కోసం ప్రయివేటు సంస్థకు బాధ్యతలు అప్పగించారే కానీ దాన్ని అద్దెకివ్వలేదు. ఇలాంటి అనేక అవాస్తవాలు, వాస్తవాలు కలబోతగా 21 అంశాలను పేర్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి బీజేపీ వర్గాలు కౌంటర్ మెసేజ్ లు కూడా అప్పుడే సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి.