కొత్త బ్యాడ్ న్యూస్.. కరోనా పీడ జులైలో తీవ్రం !!

August 15, 2020

కరోనా మన ఆరోగ్యాలను పాడు చేయడం సంగతి పక్కన పెడితే... మన ఆర్థిక సమస్యలను మాత్రం విపరీతంగా పెంచింది. ఈఎంఐల భారం ఉన్నవాళ్లు కుదేలైపోయారు. కొన్నిరోజులుగా ఇది వ్యాప్తిస్తున్న తీరు చూస్తుంటే... తగ్గేదెపుడో కూడా అంచనా లేకుండాపోయింది. రోజురోజుకు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కేసులు పెరుగుదల రేటు పెరిగింది. ఇటలీ సంఖ్యలు మన దేశంలోను నమోదవుతున్నాయి. కాకపోతే అదృష్టవశాత్తూ మరణాలు మాత్రం తక్కువ ఉన్నాయి.

రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతు వచ్చి... ఇప్పుడు రోజుకు సుమారు 3 వేల కేసుల వరకు బయటపడుతున్నాయి. దీనిపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందిస్తూ భయంకరమైన నిజం చెప్పారు. ఇపుడు మనం చూస్తున్నది పతాక స్థాయి కాదని... మనం జూన్, జూలై మాసాల్లో  కరోనా పతాకస్థాయిని చూడబోతున్నామన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా వేసిన అంచనాలు, పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండనుందని ఆయన పేర్కొన్నారు. 

భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తే నెలరోజుల్లో కరోనా అదుపులోకి రావాలి. కానీ ఎక్కడా అది కఠినంగా జనం పాటిస్తున్నట్లు లేదన్నారు. అందుకే ఈ స్థాయిలో ఉదృతి కనిపిస్తోందన్నారు. ఇతర అంశాలు కూడా ఈ లెక్కలను ప్రభావితం చేయొచ్చు.. అయితే అది కాలం మాత్రమే చెప్పగలదు అన్నారు. లాక్ డౌన్ పొడిగింపు ప్రభావం కూడా ప్రస్తుతానికి కనిపించడం లేదని.... మరికొన్ని రోజులు గడిస్తే ఒక అంచనాకు రావొచ్చన్నారు. 

 

దేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? 

ఇదిలా ఉండగా... దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 53000. దేశవ్యాప్తంగా 1,783 మరణాలు సంభవించాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 35,902 కాగా, 15,266 మంది డిశ్చార్జి అయ్యారు. ఉత్తరాదిన కరోనా బాగా విజృంభిస్తోంది.  ముఖ్యంగా మహరాష్ట్రలో పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలో మూడో వంతు కేసులు అక్కడివే. ఇక గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విజృంభణ ఎక్కువగా ఉంది. వీటిలో ఎందులోను 3 వేలకు కేసులు తక్కువగా లేవు.