దేశాన్ని మోడీ రిస్కులో పెడుతున్నారా?

August 05, 2020

కరోనా కాటు... తప్పించుకుందామన్నా తప్పించుకునేది కాదు. ప్రపంచంలో ఏ దేశాన్నీ వదలని ఈ మహమ్మారి ఏదో విధంగా మనదేశంలోకి రాకుండా అరికట్టే అవకాశం ఉన్నా అరికట్టలేదు అని మోడీని కొందరు విమర్శిస్తున్నారు. అది అంత సరైన విమర్శ అనిపించడం లేదు. వాస్తవానికి ఇధి ఎటుతిరిగి ప్రపంచంపై ప్రకృతి విసిరిన సవాల్. చాలావరకు ప్రపంచం ఊహించిన దానికంటే ఇండియా మంచి చర్యలే తీసుకుంది. చాలావరకు కంట్రోల్లో పెట్టింది. లాక్ డౌన్ లేకుండా కంట్రోల్ చేయలేము అని అర్థం అయ్యాకే మన ప్రధాని మోడీ లాక్ డౌన్ కి సిద్ధం అయ్యారు. అయితే... ఇన్ని దేశాల అనుభవాలు గమనించిన తర్వాత కూడా 21 రోజు లాక్ డౌన్ తో అంతా అయిపోతుందని పొరపాటు అంచనా వేశారు. పక్కనే ఉన్న మర్కజ్ ముప్పు ఆలస్యంగా తెలియడంతో అది సరిపోలేదు. కాకపోేతే 21 రోజుల లాక్ డౌన్ చాలా మంచేచేసింది.  కానీ రేపటితో 21 రోజులు పూర్తవుతుండటంతో ప్రధాని మోడీ రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారట. అయితే, దేశంలో పరిస్థితులు గమనించిన జనం ఎవ్వరూ లాక్ డౌన్ సడలింపు ఉంటుందని అనుకోవడం లేదు. కానీ ఉంటే బాగుంటందని అనుకునేవారు తక్కువేం లేరు. అయితే ఇప్పటివరకు బయటకు వస్తున్న వార్తల ప్రకారం అయితే మోడీ పొరపాటు చేస్తున్నారా? అని భయమేసే పరిస్థితి. 

21 రోజుల లాక్ డౌన్ ను కొత్త మలుపు తిప్పిన ఇంటర్వెల్ బ్యాంగ్ మర్కజ్ సీను. వీరిని ఆస్పత్రులకు రమ్మంటే వారిలో చాలామంది బయటకు రాలేదు. చివరకు టెక్నాలజీ సాయంతో అందరినీ పట్టేసుకోవడానికి ఏప్రిల్ 10 వచ్చేసింది. అంతలోపు వారు చాలా మందికి తెలియకుండా వ్యాపింపజేశారు. ఇపుడు అలా ఒకరి నుంచి ఒకరికి సోకిన వారు... వ్యాధి బయటపడటానికి ఏప్రిల్ 22 దాకా అవుతుంది. అంతలోపు అంటే రేపు లాక్ డౌన్ సడలిస్తే వీరు ఎంతమందికి సోకిస్తారో తెలియని భయం. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఏ మాత్రం సడలించినా సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్టే. వాస్తవానికి జీవితం ఎంత ముఖ్యమో, ఎకానమీ అంతే ముఖ్యం. అది లేకపోతే ఇది లేదు. ఇది లేకపోతే అది లేదు. అయినా... ఈ నేపథ్యంలో కనీసం 15 రకాల పరిశ్రమలు, వీధి వ్యాపారులు తమ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇందులో పనిచేసే వారి ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకునేది ఎవరు? వారిని పర్యవేక్షించేది ఎవరు? అంత బాధ్యత ఆ ప్రైవేటు కంపెనీలు తీసుకుంటాయా? పరిశ్రమలు తీసుకుంటాయా? ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు. 

మరి మనం వెనక్కు వెళ్తే ముళ్లకంప ఉందని ముందుకు వెళ్లి పులి నోట్లో తలపెట్టలేని పరిస్థితి. అలాంటపుడు ప్రజా జీవనంతో పాటు ఆర్థిక వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా రెండో విడత లాక్ డౌన్ ప్రిపేర్ చేస్తున్న కేంద్రం... అసలు మనవాళ్లలోని బాధ్యతా రాహిత్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాలి. ఎలక్ట్రికల్, టెలికం, కంప్రెషర్, కండెన్సర్ యూనిట్లతో పాటు, స్టీల్, లోహ ఉత్పత్తుల మిల్స్, స్పిన్నింగ్ మిల్స్, పవర్ లూమ్స్, రక్షణ రంగ పరికరాలు తదితర కంపెనీలు తెరిచే ఆలోచనలో ఉన్న మోడీ... దేశాన్ని రిస్కులో పెడుతున్నారా అన్న భయమూ కలుగుతోంది. ఇక ఆహార పరిశ్రమను అయితే పరిహరించక తప్పదు. తినకపోతే చస్తాం కాబట్టి దానికి అన్ని మినహాయింపులు తప్పవు. కానీ మిగతా వాటి విషయంలో కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. లాక్ డౌన్ లో సడలింపులు ఎక్కువైతే దేశం రిస్కులో పడినట్టే మరి.