కేంద్ర కొత్త ఆలోచన - MRO, ఏమిటిది? 

August 13, 2020

నిర్మాలా సీతారామన్, దేశ ఆర్థిక మంత్రి, ఈరోజు ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విమానయాన రంగంలో ఇండియాను ఎం.ఆర్.ఒ హబ్ గా మార్చనున్నట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. దేశీయ విమానయాన రంగం పాతాళాన్ని చూసింది. విమానం కనిపెట్టిన తర్వాత ఆ రంగం ఇంత పెద్ద సంక్షోభాన్ని అనుభవించడం ఇదే తొలిసారి. అందుకే దానిని సమూలంగా మార్చి కొత్త దిశగా తీసుకెళ్లనున్నట్లు పెద్ద ఎత్తున సంస్కరణలు తేనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

MRO = Maintenance, Repair and Overhaul

 ఎమ్మారో అంటే నిర్వహణ, మరమ్మతు, సమగ్ర పునరాభివృద్ధి (ఎంఆర్‌ఓ) అని అర్థం. భారతదేశాన్ని ఎమ్మార్వో హబ్ గా తీర్చిదిద్ది ఆ ఇండస్ట్రీని సమూలంగా అభివృద్ధి చేయడం ద్వారా ఎకనామీలో దానిని కీలకం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం అన్నారు. "ప్రయాణకుల విమానాలతో పాటు, సాయుధ, యుద్ధ విమానాలకు కూడా భారతదేశాన్ని భారీ హబ్ గా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దీనివల్ల దేశం ఆర్థికంగా పురోగమించడమే కాదు, విమానయాన సంస్థల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. తద్వారా అంతిమంగా దేశంలో విమాన ప్రయాణం చవకగా మారుతుంది అని నిర్మల సీతారామన్ వివరించారు.

20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఉద్దీపన చర్యలలో చివరి అంకాన్ని ఆమె ఈరోజు వివరించారు. అందులో విమానయాన రంగం, పర్యాటక రంగం, బొగ్గు గనులు కీలక అంశాలుగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) ప్రాతిపదికన మరో ఆరు విమానాశ్రయాలను వేలం వేస్తున్నట్లు, భారతీయ గగనతలాలను బాగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.

పోటీ వల్ల విమానయాన రంగంలో విపరీతమైన మార్పులు వస్తాయన్నారు. భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటి. ఇంకా ఎన్నోరెట్లు ఈ రంగం విస్తరించే అవకాశం ఉంది. విమానయాన హబ్ గా మారడానికి భారతదేశానికి అవసరమైన అన్ని సామర్థ్యాలు, మానవ వనరులు, నైపుణ్యాలు ఉన్నాయన్నారు.