ఎన్నారై డాక్టరుకి అరుదైన గౌరవం

August 12, 2020

అమెరికా, యూరప్ ఖండాల్లో మన వైద్యులకు ఎంత విలువ ఉందో తెలుసా... దేవ దూతలుగా చూస్తారు. ఆమాటకొస్తే ఏ వైద్యులను అయినా వారు అంతే గౌరవించుకుంటారు.  మన దేశంలో, మన రాష్ట్రంలో కరోనా ఈ స్థాయిలో ప్రబలుతున్నా... బేసిక్స్ కూడా తెలియని నాయకులు మీడియా ముందుకు వచ్చి పారసిటమల్ వేసుకో తగ్గిపోతుందంటారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎమ్మెల్యేలు, మంత్రులు వైద్య పాఠాలు చెబుతున్నారు. ఇది మనకర్మ. అమెరికాతో సహా అనేక దేశాల్లో వైద్యులు మైకు ముందు నిలబడి మాట్లాడుతుంటే... అగ్రరాజ్య అధ్యక్షుడు ఆ వెనుక నిలబడి ఉంటాడు. కానీ మన వద్ద మాస్క్ అడిగినందుకు సస్పెండ్ చేశారు. అసలు వైద్యుడి విలువ తెలిస్తే... ఇలా ప్రవర్తిస్తారా? ఈరోజు వైద్యుడు లేకపోతే ప్రపంచ జనాభాలో సగం ఖాళీ అయిపోయేది.

అమెరికాలోని ఒక పట్టణంలో కోవిడ్ 19 బాధితులకు చికిత్స చేసిన మన భారతీయ వైద్యురాలికి అక్కడి స్థానికులు ఎంత ప్రేమను పంచారో చూడటానికి మన కళ్లు చాలవు. న్యూయార్క్ - బోస్టన్ నగరాల మధ్యన సౌత్ విండ్సర్ పట్టణంలో మన దేశానికి చెందిన డాక్టర్ ఉమ మధుసూదన్ చేసిన సేవలకు అమెరికన్లు ముగ్దులయ్యారు. సాధారణంగా అమెరికన్ కంట్రీ సైడ్ వైద్యులకు పెద్దఎత్తున గౌరవ మర్యాదలు దక్కుతాయి. అయితే... కరోనా ప్రభావం ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో తన జీవితం పణంగా పెట్టి సేవలందించిన ఆమెను వందలాదిగా అమెరికన్లు రకరకాల వాహనాల్లో వచ్చి ఆమెకు వ్యక్తిగతం గౌరవవందనం సమర్పించుకుంటూ, కృతజ్జతలు తెలుపుకుంటూ వెళ్లారు. ఆ వాహన శ్రేణి ఎంతకీ తగ్గడం లేదు. అలా వస్తూనే ఉన్నాయి. ఒక భారతీయ వైద్యురాలికి ఇంతగా ప్రేమతో వారు గౌరవించడం చాలా అరుదైన సందర్భం. మైసూరు నుంచి వచ్చిన ఆమె ఇక్కడ స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఆమెకు దక్కిన గౌరవాన్ని మీ కళ్లతో మీరే స్వయంగా చూడండి. కింద వీడియో ఉంది.