రాహుల్ గాంధీని పబ్లిక్ గా కొట్టాలి

June 03, 2020

పౌరసత్వ సవరణ బిల్లు సంగతేమో కానీ.. దాని కారణంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న లొల్లి అంతా ఇంతా కాదు. ఇష్యూ మీద ఫోకస్ చేయాల్సిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. అనూహ్యంగా చేసిన వ్యాఖ్యలు ఇష్యూను మరో వైపుకు తీసుకెళ్లేలా చేశాయి. తన పేరు రాహుల్ గాంధీ అని.. తానేమీ రాహుల్ సావర్కర్ కాదని.. మాట మార్చటానికి అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మరాఠా నేతలు తీవ్ర ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై తాజాగా సావర్కర్ మనమడు రంజిత్ సావర్కర్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తన మాటలతో అవమానించిన రాహుల్ ను పబ్లిక్ లో కొట్టాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు విన్నవించారు సావర్కర్ మనమడు రంజిత్ సావర్కర్.
తన తాత బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పలేదని.. అయితే చెప్పినట్లుగా రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలల్లో నిజం లేదన్నారు. అదే పనిగా తన తాత బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పినట్లుగా రాహుల్ ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. జైలు నుంచి విడుదలయ్యేందుకు బ్రిటీష్ వారు పెట్టిన నిబంధనల్ని మాత్రమే ఆయన అంగీకరించారే తప్పించి క్షమాపణలు చెప్పలేదన్నారు.
జరిగిన దానిని వక్రీకరిస్తూ రాహుల్ వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమని.. ఆయనకు ఇదో అలవాటుగా మారిందన్నారు. గతంలో నెహ్రూ సైతం శివాజీని దొంగగా వ్యాఖ్యలు చేసి తర్వాత సారీ చెప్పారన్నారు. తన కుటుంబానికి అలవాటైన తప్పుల్ని రాహుల్ కూడా రిపీట్ చేస్తున్నారని మండిపడ్డారు.
రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీతో పాటు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను కోరారు. రాహుల్ మీద చర్యలు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం పడిపోదని.. ఒకవేళ పడినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఉందన్న వ్యాఖ్యలు చేశారు. మరి.. ఈ వ్యాఖ్యలపై ఉద్దవ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.