కువైట్ ఎన్నారైలకు భారీ షాక్ _ భారత్ కూ షాకే

August 12, 2020

కువైట్ పార్లమెంట్ ఇండియన్లకు భారీ షాక్ ఇచ్చింది. 43 లక్షల జనాభా కలిగిన తమ చిన్నదేశంలో 15 లక్షలు మంది ఇండియన్లే ఉండటాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి సగానికి పైగా ఇండియన్లను పంపేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ప్రకటను పరిమితం కాలేదు. భారతీయుల సంఖ్యను పరిమితం చేసే ఒక ప్రవాస కోటా బిల్లుకు కువైట్ ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. దేశ జనాభాలో 15 శాతానికి మించి ఇండియన్లు తమ దేశంలో ఉండకూడదన్నది ఈ బిల్లు సారాంశం.

కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలు ఎంత విపరీతంగా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఆ దేశంపై పడుతున్న ఆర్థిక, సామాజిక, మెడికల్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవడానికి కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నారైలకు ఇంత పెద్ద షాక్ ఏ దేశంలోను తగల్లేదు. ఇది ఒక భారీ నిర్ణయం. 

14.5 లక్షలు కువైట్లో నివసిస్తున్నారు. అంటే ఆ దేశ జనాభాలో మూడో వంతు ఇండియన్లే. తాజా బిల్లు ఆమోదంతో కువైట్‌లో నివసిస్తున్నఎన్నారైలలో దాదాపు ఎనిమిది లక్షల మంది భారతీయులు ఇండియాకు తిరిగి రాక తప్పదు. కువైట్‌లోని స్థానిక మీడియా ద్వారా వెలువడిన సమాచారం ప్రకారం  ఎట్టి పరిస్థితుల్లోను ఇందులోమినహాయింపులు ఉండబోవని తెలుస్తోంది. తమ స్థానిక జనాభాకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం అని, ఇదొక రాజకీయ ఒత్తిడితో కూడుకున్న నిర్ణయమని తెలుస్తోంది. 

ఒక నివేదిక ప్రకారం, 43 లక్షల కువైట్ జనాభాలో 30 లక్షల మంది ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. కువైట్ ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబా ఇటీవల దేశంలో నివసిస్తున్న ప్రవాసుల సంఖ్యను మొత్తం జనాభాలో 70 శాతం నుండి 30 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దాని ఫలితమే ఇది.