అందులో ఇందిరాగాంధీ రికార్డును ఇంకా అందుకోని మోడీ

July 12, 2020

ఆర్టికల్ 360 ప్రయోగమంటేనే... దేశంలోని అన్ని రాష్ట్రాలు భయపడిపోతాయి. రాష్ట్రపతి పాలనకు ఆస్కారమిచ్చే ఈ ప్రయోగం అంటే ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా భయోత్పాతానికి గురి అవుతారు. ఎందుకంటే... తాము ఎన్నుకున్న స్థానిక ప్రభుత్వాలను అధికారం నుంచి దించేసి... కేంద్ర ప్రభుత్వం సాగించే పాలనను గుర్తు చేసుకుంటే భయోత్పాతం కాక మరేమిటి? ఇప్పుడు మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ ప్రతిష్ఠంభన నేపథ్యంలో అక్కడ కూడా రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో అసలు దేశంలో ఎన్నిసార్లు ఆర్టికల్ 360ని ప్రయోగించారు? ఏఏ ప్రధాని ఎన్నెన్ని సార్లు ఈ ప్రయోగాన్ని చేశారు? ఏఏ పార్టీ ప్రభుత్వాలు ఇలా రాష్ట్రాల అధికారాలను కత్తిరించేశాయి? అన్న విషయాలు నిజంగానే ఆసక్తి కలిగించేవే కదా.
ఆర్టికల్ 360ని ప్రయోగానికి సంబంధించి... స్వతంత్ర భారతావనిలో ఇప్పటిదాకా వంద సార్లు రాష్ట్రపతి పాలన అమలైంది. అంటే... దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకంగా వంద సార్లు రాష్ట్రపతి పాలన పేరిట కేంద్రం పెత్తనం చెలాయించిందన్న మాట. మరి ఇన్నేసి సార్లు రాష్ట్రపతి పాలన అమలు జరగగా... ఎవరెవరు ఈ అస్త్రాన్ని ప్రయోగించారన్న విషయం కూడా ఆసక్తి కలిగించేదే. ఉక్కు మహిళగా పేరొందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఇందిరా గాందీ... ఏకంగా 50 సార్లు ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇక ఇందిర పార్టీకి చెందిన పీవీ నరసింహారావు 11 సార్లు ఈ అస్త్రాన్ని ప్రయోగించగా... మౌనమునిగా ముద్రపడిన మన్మోహన్ సింగ్ తన పదేళ్ల కాలంలో ఏకంగా 12 సార్లు ఈ అస్త్రాన్ని ప్రయోగించారట.
ఇక జనతా పార్టీ హయాంలో అప్పటి ప్రధాని మోరార్జీ దేశాయ్ కూడా ఏకంగా 16 సార్లు ఆర్టికల్ 360 అస్త్రాన్ని ప్రయోగించారట. ఇక భారత తొలి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ ఈ అస్త్రాన్ని 8 సార్లు ప్రయోగించారు. ఇక ఆ తర్వాత ఈ అస్త్రాన్ని అంతగా బయటకు తీయనట్టే కనిపించిన రాజీవ్ గాంధీ 6 సార్లు, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్ పేయి 5 సార్లేసి, చరణ్ సింగ్ 4 సార్లు, వీపీ సింగ్ 2 సార్లు, లాల్ బహదూర్ శాస్త్రి, దేవేగౌడ ఒక్కొక్క సారి ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ... తన తొలి ఐదేళ్ల పాలనలో కేవలం రెండు సార్లు మాత్రమే ఆర్టికల్ 360 జోలికి వెళ్లగా... ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఈ అస్త్రం ప్రయోగంతో మోదీ ఇప్పటిదాకా మొత్తంగా 3 సార్లు మాత్రమే ఈ ఆర్టికల్ ను ప్రయోగించినట్టైంది. ఈ లెక్కన... దూకుడుగా వెళుతున్నట్లుగా కనిపిస్తున్న మోదీ... ఆర్టికల్ 360 ప్రయోగంలో మాత్రం కాస్త సౌమ్యంగానే కనిపిస్తున్నారని చెప్పాలి.