కేసీఆర్ మొండిపట్టు.. మాజీ ఎమ్మెల్యే త్రుటిలో తప్పిన ప్రమాదం

February 19, 2020

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయివేటు డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. సరైన అనుభవం లేని డ్రైవర్లను కూడా తీసుకోవడంతో ఇప్పటికే గత రెండు రోజుల్లో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. తాజాగా ఏకంగా ఓ మాజీ ఎమ్మెల్యేపైకి బస్సు దూసుకెళ్లింది.. ఆయన కూర్చున్న ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న వ్యక్తి అప్రమత్తంగా వ్యవహరించి బండి రోడ్డుపక్కకు దించడంతో పెద్ద ముప్పే తప్పింది. ప్రాణాపాయం తప్పినప్పటికీ మాజీ ఎమ్మెల్యేకు అలా కావడంతో ఆయన నియోజకవర్గ ప్రజలు బస్సును ఆపి డ్రైవరును గట్టిగా మందలించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం సమీపంలో జరిగింది. వీఆర్ పురం గతంలో తెలంగాణలో ఉండేది.. విభజన తరువాత ఏపీలో కలిపారు. అయితే, తెలంగాణ నుంచి ఆ ప్రాంతాలకు బస్సులు తిరుగుతున్నాయి.
టీఎస్ ఆర్టీసీ బస్సును నడుపుతున్న ఓ తాత్కాలిక డ్రైవర్, అతి వేగంతో దూసుకు రాగా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.  స్థానిక సీపీఎం నేత బొప్పెన కిరణ్ తో కలిసి సున్నం రాజయ్య బైక్ పై వస్తూ, శబరి నదిపై నిర్మించిన వంతెన పైకి చేరుకున్న వేళ, ఎదురుగా అత్యంత వేగంగా బస్సు దూసుకు వచ్చింది. దీంతొ కిరణ్ వెంటనే బైక్ కు బ్రేక్ వేసి, రోడ్డు కిందకు బండిని దించాడు. దీంతో ప్రమాదం తప్పింది.
స్థానికులు వెంటనే బస్సును ఆపి పోలీసులకు సమాచారమివ్వడతో వెంటనే వారు అక్కడకు చేరుకున్నారు. సున్నం రాజయ్య జోక్యం చేసుకుని డ్రైవరును వదిలేయమని సూచించడంతో పోలీసులు డ్రైవరుకు అతి వేగం తగదని చెప్పి కౌన్సిలింగ్ చేసి పంపించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ మొండిపట్టుదలతో వ్యవహరిస్తూ అనుభవం లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను తిప్పుతుండడతంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రజల మనిషైన సున్నం రాజయ్యను పోగొట్టుకునే పరిస్థితి కేసీఆర్ కారణంగానే వచ్చిందంటూ స్థానికులు మండిపడ్డారు.