ఇన్ఫో పెద్దాయన నోట షాకింగ్ వ్యాఖ్యలు

August 15, 2020
CTYPE html>
కేంద్రం విధించిన లాక్ డౌన్ గడువు మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. దేశంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల నమోదు సాగుతూనే ఉంది. మరెంత కాలం సాగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటివేళ.. పలువురు లాక్ డౌన్ కొనసాగిస్తే జరిగే నష్టం భారీగా ఉంటుందన్న అంచనాలు ఒకవైపు.. కొనసాగించకుండా ఎత్తివేస్తే.. చోటు చేసుకునే విపరిణామాల మీద జోరు వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పంజాబ్.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు ఇప్పటికే లాక్ డౌన్ ను పొడిగిస్తూ తమ నిర్ణయాల్ని వెల్లడించారు.
ఇలాంటివేళ దేశ ఐటీ రంగానికి పెద్దాయనగా.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పొడిగించటం ఏ మాత్రం సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన.. అదే జరిగితే నష్టం భారీగా ఉంటుందని హెచ్చరించటం గమనార్హం.  లాక్ డౌన్ ను పొడిగిస్తే కరోనా కారణంగా మరణించే వారి కంటే ఆకలి మరణాలు పెద్ద ఎత్తున ఉంటాయంటున్నారు.
పని చేసే అవకాశం ఉన్న వారిని వీలైనంత త్వరగా ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయటం మంచిదన్న మాటను ఇన్ఫోసిస్ పెద్దాయన నోటి నుంచి వచ్చింది. తాజాగా నిర్వహించిన ఒక వెబినార్ లో ఆయనీ కీలక వ్యాఖ్యలు చేవారు. డెవలప్ అయిన దేశాలతో పోలిస్తే.. మన దేశంలో వైరస్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని గుర్తు చేశారు.
దేశంలో ప్రతి ఏడాది వేర్వేరు కారణాలతో మరణించే వారి సంఖ్య 90 లక్షల వరకూ ఉంటుందన్నారు. అందులో కాలుష్యం కారణంగానే నాలుగోవంతు మంది మరణిస్తున్నారని.. కరోనా కారణంగా గడిచిన రెండు నెలల్లో వెయ్యి మంది మరణించారని.. దీనికి ఎక్కువ ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. లాక్ డౌన్ పొడిగిస్తే దేశ వ్యాప్తంగా సుమారు 19 కోట్ల మంది అసంఘటిత.. స్వయం ఉపాధితో బతుకుతున్నారని.. లాక్ డౌన్  పొడిగిస్తే ఇలాంటి వారి జీవనాధారం ప్రమాదంలో పడుతుందన్నారు. వ్యాపారులు సైతం 15 నుంచి 20 శాతం ఆదాయాన్ని కోల్పోతారన్నారు.
దేశంలో కరోనా వైరస్ నిర్దారిత  పరీక్షల్ని మరింత ఎక్కువగా చేయించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయుల జన్యు పరిస్థితుల కారణంగా యువతలో వైరస్ లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. కరోనాకు ముందు ఏ రీతిలో అయితే పని చేస్తున్నారో.. ఇప్పుడు కూడా ఒక షిఫ్టుకు పరిమితం కాకుండా.. మూడు షిఫ్టుల్లో పని చేయాల్సిన అవసరాన్ని ఇన్ఫోసిస్ పెద్దాయన చెప్పటం చూస్తే.. లాక్ డౌన్ ఆంక్షల్ని ఉత్పత్తి రంగానికి పూర్తిస్థాయి పని చేస్తే తప్పించి.. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చెప్పిన మాటల్ని అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్రాలు కానీ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటాయో చూడాలి.