'ఇన్‌సైడర్‌’ దొంగాట

August 03, 2020

బినామీలంటూ అబద్ధాలు
భూములు కొనడం నేరమా?
అక్కడ వైసీపీ నేతలకు
ఎన్ని ఎకరాలున్నాయో చెప్పరేం


నిజానికి అమరావతి భూకొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని.. అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటన చేసినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌ ఆరోపిస్తూనే ఉన్నారు. అఽధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాట. చంద్రబాబు, లోకేశ్‌, టీడీపీ నేతలు, నాటి మంత్రులు తమ బినామీల పేరిట వేలకు వేల ఎకరాలు కొన్నారని జగన్‌ బృందం సాక్షాత్తూ అసెంబ్లీలోనే పచ్చి అబద్ధాలు చెప్పింది. అదే నిజమైతే వారే అధికారంలో ఉన్నారు.. ఏడు నెలలుగా సీఎంగా ఉన్నారు. ఇంతవరకు ఎందుకు దర్యాప్తు జరపలేదు? సీఐడీ విభాగాన్ని ముందే రంగంలోకి దించారు. క్రయవిక్రయాలపై ఆరా తీశారు. నిజంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌  జరిగి ఉంటే.. అలా భూములు కొనడం నేరమైతే.. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవలసిందే. మరి ఎందుకు చేయలేదు? ఆధారాల్లేవు కాబట్టి. భూముల కొనుగోలు నేరం కాదు కాబట్టి. పైగా తాడేపల్లిలో తాను కట్టుకున్న ఇల్లు కూడా జగన్‌ పేరుపై లేదు. ఆయన భార్యాబిడ్డల పేరుతోనూ లేదు. తల్లీ చెల్లెలి పేరుతోనూ లేదు. ఎవరో ఆరుగురు బినామీల పేరిట ఉంది. వీరిలో ఇద్దరు బెంగళూరులోని ఆయన ప్యాలెస్‌ నిర్వహించేవారని తెలుస్తోంది. ఇది బయటకు పొక్కడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. ఇంకోవైపు.. కేసుల భయం. సీబీఐ దర్యాప్తు దాదాపు పూర్తయింది. కోర్టులో తుది విచారణ ప్రారంభం కాకుండా పదేపదే పిటిషన్లు వేస్తూ వస్తున్న ఏ-1 జగన్‌, ఏ-2 విజయసాయిరెడ్డి భవితవ్యం ఈ నెల 24తో తేలిపోతుంది. వేర్వేరు నేరాలపై వారిపై 11 చార్జిషీట్లు దాఖలయ్యాయి. వాటన్నిటినీ కలిపి విచారించాలని వారు వాదిస్తున్నారు. నిందితులు వారే అయినా నేరాలు వేరని.. వేర్వేరుగానే విచారణ చేపట్టాలని సీబీఐ స్పష్టం చేస్తోంది. గతంలో బిహార్‌ మాజీ సీఎం, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. దాణా స్కాంకు పాల్పడినప్పుడు.. వేర్వేరు ట్రెజరీల నుంచి వేల కోట్లు స్వాహా చేశారు. ప్రతి ట్రెజరీ నుంచి అక్రమంగా డబ్బులు డ్రా చేసుకున్నారు. వేర్వేరుగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. వేర్వేరుగా విచారణ జరుగుతోంది. ఇప్పటికి ఐదు కేసుల్లో ఆయనకు జైలు శిక్ష పడింది. జగన్‌కు ఇప్పుడా భయం పట్టుకుంది. దీనికితోడు ఆయన ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు ఖజానాకు పెనుభారంగా తయారయ్యాయి. సంక్షేమ పథకాలకు డబ్బుల్లేక.. అప్పులిచ్చేవారు లేక ఆర్థిక శాఖ సతమతమవుతోంది. అభివృద్ధి పనులకు ఖర్చుచేయడానికి పైసా మిగలడం లేదు. సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ పడకేశాయి. కనుచూపు మేరలో ఆదాయం పెరిగే పరిస్థితి లేదు. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. వైసీపీ కార్యకర్తలకు గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వలంటీర్ల పోస్టులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాను దోచిపెడుతున్నారు. సాధారణ యువతకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. జగన్‌ మాటలు, చేతలకు హస్తిమసికాంతర భేదం ఉందని తేలిపోవడంతో క్రమేపీ ప్రజల్లో అసంతృప్తి మొదలైంది.. ఇది పసిగట్టే తుగ్లక్‌ పనికి ఆయన శ్రీకారం చుట్టారు. రాజధాని తరలింపు నాటకం మొదలుపెట్టారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. ఇందుకోసం జీఎన్‌ రావు కమిటీని వేశారు. ఆయన అసెంబ్లీలో చెప్పినదానికి పొల్లుబోకుండా ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. విజయసాయిరెడ్డి అల్లుడి స్నేహితుడు భాగస్వామిగా ఉన్న బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు (బీసీజీ) కూడా జగన్‌ అనుకున్న విధంగా నివేదిక ఇచ్చింది. వీటిపై అధ్యయనానికి హైపవర్‌ కమిటీ అన్నారు. అదెంత చక్కగా పనిచేస్తోందో ఇప్పటి వరకు జరిగిన రెండు భేటీలే చెబుతున్నాయి. ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా వారిలో వారు మాట్లాడుకోవడమే విడ్డూరం


తుగ్లక్‌కే ఈ ఘనకీర్తి..
భారతదేశంలో ఇలా రాజధానిని మార్చినవాడు మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ మాత్రమేనని చరిత్రలో మనం చదువుతాం. ఇప్పుడు అతడిని మించిన ఘనుడు మన సీఎంగా వచ్చాడు. అమరావతి ప్రాంత రైతుల త్యాగం ఆయనకు ఊడిన వెంట్రుకతో సమానం. వేల కోట్లు పెట్టి కట్టిన భవనాలు మట్టిగడ్డలతో సమానం. రూ.8 కోట్లు ఖర్చుపెట్టి కట్టిన ప్రజావేదికను ఽనేలకూల్చిన నాడే ప్రజాధనం అంటే ఆయనకు ఎంత గౌరవమో తేలిపోయింది. ‘రాజధాని విజయవాడలో పెట్టండి, గుంటూరులో  పెట్టండి, ఇంకెక్కడైనా పెట్టండి! అభ్యంతరం లేదు. ఏదైనా చర్చ జరిగిన తర్వాత ప్రకటన రావాలి. మేం భయపడినట్లుగానే మొదట ప్రకటన చేసేశారు. ఆ తర్వాత చర్చ జరిపించుకోండి... అంటున్నారు. అయినప్పటికీ... విజయవాడలో రాజధాని పెట్టడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం.. మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రంగా మారింది. ఒక ప్రాంతానికీ, ఇంకో ప్రాంతానికీ మధ్య చిచ్చు పట్టడం ఇష్టంలేక... రాజధాని ప్రకటనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కేపిటల్‌ ఎక్కడైనా పెట్టండి. కనీసం 30 వేల ఎకరాలున్న చోట పెట్టండి. ఎందుకంటే... ఒకసారి ఆ ప్రాంతంలో 30 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే, ల్యాండ్‌ రేటు ఇంత అని ప్రభుత్వమే నిర్ణయించవచ్చు’ అని జగన్‌ నాడు అసెంబ్లీలో చెప్పారు. నిరుడు ఎన్నికల ముందు కూడా.. రాజధాని తరలిపోయే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు బలంగా ఉద్ఘాటించారు. జగన్‌ మనసులో అలాంటి ఆలోచనే లేదని.. దీనికి కారణం జగన్‌ అమరావతిలోని తాడేపల్లిలో భారీ నివాసం నిర్మించుకోవడమేనని చెప్పారు. అధికారంలోకి వచ్చినా రాజధాని నగరం అమరావతిని మార్చబోమంటూ ప్రకటించాలని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ అభ్యర్థులు జగన్‌ను కోరారు. రెండు జిల్లాల్లో పార్టీకి మంచి అవకాశాలున్నాయని... రాజధాని అంశంపైనే ప్రజల్లో సందేహాలున్నాయని తెలిపారు. ఎన్నికల ముందు తాడేపల్లిలో నిర్మించిన నివాస ప్రాంగణంలోనే జగన నేతృత్వంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. రాజధాని నగరంగా అమరావతిని కొనసాగిస్తామంటూ తీర్మానం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయవాడలో విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. రాజధాని మార్చేస్తారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అమరావతిపై చిన్న అనుమానం కూడా రాకుండా వ్యవహరించారు. మేనిఫెస్టోలో ఈ మాటెత్తలేదు. రాజధాని మారుస్తామని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా నిజస్వరూపం చేశారు. మొదట ఇక్కడేమీ లేదు.. రాజధానిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ చంద్రబాబు ఇవ్వలేదు.. అంటూ బొత్స సత్యనారాయణ ద్వారా తమ మనసులో మాట చెప్పించారు. తర్వాత ఇక్కడ కరకట్టపై అక్రమ కట్టడాలున్నాయని.. చంద్రబాబు ఉంటున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమేనని దానికి నోటీసులిచ్చి కూల్చివేస్తామని నాటకాలాడారు. సాధ్యం కాకపోవడంతో అమరావతి ముంపు ప్రాంతమని దుష్ప్రచారానికి దిగారు. దీనిని నిరూపించుకునేందుకు శ్రీశైలంలో వరద జలాలను దిగువకు వదలకుండా మూడురోజులు అట్టిపెట్టి అకస్మాత్తుగా కిందికి విడుదల చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు ఉంటున్న ఇల్లు మునిగిపోతుందని భావించారు. తీరా దిగువన లంక గ్రామాలన్నీ మునిగిపోయి వేల మంది నిరాశ్రయులయ్యారు. చివరిగా బినామీలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ అసెంబ్లీలోనే అసత్యాలకు శ్రీకారం చుట్టారు. వారి వాదనలోని డొల్లతనం ప్రజలకు కూడా అర్థమవుతోంది. కానీ ఏం చేస్తారు? కోరి తెచ్చుకున్న కొరివి తలకు నిప్పెడుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. 151 స్థానాలను ఇచ్చి మరీ కుర్చీపై కూర్చోబెట్టారు. ఐదేళ్లు భరించక తప్పదు. ఒకవేళ గ్రహపాటున జగన్‌ జైలుకు వెళ్తే సింహాసనం అధిష్ఠించడానికి ఆయన భార్యో, అమ్మో సిద్ధంగానే ఉన్నారు మరి!