ఇంత అవ‌మానంతో ఎలా ఉంటావ్ ద‌గ్గుబాటి.

February 27, 2020

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఓట‌మి ఎంత‌టి వారినైనా ఇబ్బందికి గురి చేయ‌కుండా ఉండదు. అయితే, ఆ ఇబ్బంది ఉంచి బ‌య‌ట ప‌డేందుకుఉన్న మార్గాల‌ను వెతుక్కుని ఎంత తొంద‌ర‌గా పుంజుకుం టే స‌ద‌రు నాయ‌కుల‌కు అంత మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఉదంతం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆయ‌న ఒక పార్టీలో ఉండ‌డం, ఆయ‌న భార్య మ‌రోపార్టీలో ఉండడంతో ఇప్పుడు రాజ‌కీయంగా ఈ కుటుంబం సెంట‌రాఫ్ ది టాపిక్‌గామారిపోయింది.

పర్చూరులో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా, నియోజకర్గ ఇన్‌చార్జిగా కొనసాగాలని దగ్గుబాటికి సూచించారట జగన్. దీంతో పర్చూరు సెగ్మెంట్‌ నలుదిక్కులా తన కొడుకును వెంటబెట్టుకుని తిరుగుతూ, పార్టీ, పాలనా వ్యవహారాలపై పట్టు సాధించారట. అయితే, రాష్ట్రంలో బీజేపీ తన రాజకీయ వైఖరిని మార్చుకుని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీలో ఉన్న పురందేశ్వరి కూడా తమ పార్టీ విధానాలకు అనుగుణంగా మాట్లాడటం ప్రారంభించారు.
వైసీపీ సర్కారు విధానాలను ప్రశ్నించారు. దీంతో దగ్గుబాటి వైఖరిని పసిగట్టాలని జిల్లా నాయకులను ఆదేశించారట జగన్‌. క్రమేపీ పర్చూరు నియోజకవర్గ వ్యవహారాల్లో ఇటు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని జోక్యం చేసుకోవడం ప్రారంభమైంది. అప్ప‌టి నుంచి కూడా జ‌గ‌న్ వైఖ‌రిలోనూ మార్పు వ‌చ్చింది. భార్య విమ‌ర్శించ‌డం, భ‌ర్త ప‌న్నెత్తు మాట కూడా అన‌క‌పోవ‌డంతో స‌హ‌జంగానే ఆయ‌న‌లో ఆగ్ర‌హం తెప్పించింది. దీంతో జ‌గ‌న్‌.. ఉంటే ఇద్ద‌రూ ఒకే పార్టీలో ఉండండి లేక పోతే.. మీదారి మీరు చూసుకోవ‌చ్చు! అని ఘాటుగానే త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.
అంతేకాదు, ఎన్నిక‌ల‌కు ముందున్న రావి రామ‌నాథాన్ని తీసుకు వ‌చ్చి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ద‌గ్గుబాటి ఏం చేస్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే, ఇన్నేళ్ల‌లో ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఇలాంటి సంక‌ట స్థితిని ఎదుర్కొన‌లేదు. దీంతో ఇప్పుడు ఏం చేస్తుంద‌నే చ‌ర్చ సాగుతోంది. కొద్దిరోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవితవ్యంపై అంతర్మథనం చెందుతున్నారని తెలుస్తోంది. శ్రేయోభిలాషులు, ముఖ్య అనుచరులతో విస్తృతంగా మంతనాలు జరుపుతున్న ఆయన, సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను చూసి కలత చెందుతున్నారట.
భార్యాభర్తలు వుంటే, గింటే ఒకే పార్టీలో వుండాలని, లేదంటే లేదని ఏకంగా వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయన్న వార్తలు, దగ్గుబాటి వర్గీయుల్లో వాడివేడి చర్చకు దారి తీశాయి. అయితే వైసీపీలో చేరాలన్నా ఒత్తిడిపై ఇంతవరకూ పురందేశ్వరి స్పందించలేదు. అంతేకాదు, ఎన్నిక‌ల‌కు ముందు ఆఫ‌ర్ వ‌చ్చినా.. తాను వెళ్లలేద‌ని, ఇప్పుడు కూడా అంతేన‌ని చెప్పారు. ఇన్నీ అవ‌మానాల నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా ద‌గ్గుబాటి ఓ నిర్ణ‌యం తీసుకుంటే.. ఆయ‌నకు గౌర‌వ‌ప్ర‌దంగా ఉంటుంద‌ని అనుచ‌రులు సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.