రండి.. ఉరేసుకుందాం !

June 01, 2020

ఇది వైరల్ అవుతున్న ఓ నెటిజన్ స్పందన

1,1,1,1...
నంబ‌ర్ వ‌న్ కావాలిబ‌య్యో..
రెండోర్యాంకు , ఐదో ర్యాంకు, ప‌దోర్యాంకు మ‌న‌కెందుకూ..
నంబ‌ర్ వ‌న్ ర్యాంకు కావాలోయ్‌!

ప్ర‌యివేటుకాలేజీలు పాగావేసి..
కార్పొరేట్ సంస్థ‌లు కోర‌లుచాచి ఎదురుచూస్తుంటే..
ఏమీరాని పిల్ల‌ల్ని వాళ్ల‌చేతుల్లో పెట్టి..
ర్యాంకుతెచ్చుకోక‌పోతే మ‌న‌కు అవ‌మానం అంటూ
పిల్ల‌ల్లి తెలిసి మ‌రీ ఆ అన‌కొండ‌ల‌కు ఎరేస్తున్నారు.

అంద‌రికీ నంబ‌ర్‌వ‌న్ ర్యాంకులే కావాలి..
ఎవ‌రికీ నంబ‌ర్ వ‌న్ అండ్ ఆఫ్ కూడా వ‌ద్దు.
అవును డియ‌ర్ పేరెంట్స్‌..
మీరు మాత్రం చ‌ద‌వ‌క ఇలా అయ్యారు..
వాళ్ల‌ను చ‌దివేయించి ఏదో చేయాల‌ని మీరెందుకు క‌ల‌గంటారు..
మీ ఒత్తిడిని.. మీ ప‌రువును.. మీ బాధ‌ను..
మీ సంతోషాల్ని, మీ గ‌ర్వాన్ని ..
పిల్ల‌ల్లో ఎందుకు చూసుకోవాలి?
మీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వాళ్ల‌నెందుకు నంజుకుతింటారు?

చ‌దువంటే జ్ఞానంకోసం కానీ..
ర్యాంకుల‌కోసం కాదు.
ఇంగితజ్ఞానం నేర్పించాలికానీ..
చ‌దువుకుంటేనే ప్ర‌యోజ‌కుడ‌వుతాడంటే ఎలా?
స‌మ‌స్య ఇది కాదు..
మీ బంధువుల పిల్ల‌లో..
మీ ఎదురింటోడో అమ్మాయో..
ప‌క్కింటోడి పిల్లోడో ఖ‌ర్మ‌కాలి ర్యాంకుతెచ్చుకుంటే..
వారిలాగే చ‌ద‌వాలంటే ఎలా?

ప‌రీక్ష పోతే ఏమీకాదు..
మ‌ళ్లీ రాయ‌చ్చు..
జీవితం పోతే మ‌ళ్లీరాద‌నే..
మాన‌సిక‌ధైర్యం క‌లిగించ‌లేని..
త‌ల్లిదండ్రులు, క‌ళాశాల టీర‌ర్లు, స‌మాజం..
ఉంటేనేం పోతేనేం.
అనామిక‌, వెన్నెల‌, అవంతిక‌, భానుకిర‌ణ్‌,
నాగేంద‌ర్‌, ధ‌ర్మారామ్‌, నీర‌జ‌, శివానీ, ప్ర‌శాంత్‌..
వీళ్లంతా ఆత్మ‌హత్య చేసుకున్న విద్యార్థులు.
ఈ త‌ప్పెవ‌రిదీ..
కాంపిటీష‌న్‌లో నెగ్గితేనే బ‌తుకని..
నూరిపోసే త‌ల్లిదండ్రుల‌ది..
ర్యాంకర్ల‌ను చేసి జీవితాల్ని మారుస్తామ‌నే
కార్పొరేట్ క‌ళాశాల‌ల‌ది.
ర్యాంకుల్ని మాత్ర‌మే చూసి..
విద్యార్థి గుండెను ప‌ట్టించుకోని స‌మాజానిది..
ప్ర‌యివేట్ క‌ళాశాల‌ల‌కు డోర్లు తెరిసే ప్ర‌భుత్వానిది..
ర్యాంకులొస్తేనే గొప్ప‌..
విజ‌య‌మే ముఖ్య‌మ‌ని చాటే మీడియాది.
నువ్వు గెలిస్తేనే మ‌నిషివి..
గెల‌వ‌కుంటే మనిషివి కాద‌ని..
ప‌రుగులెత్తించే ఈ కార్పొరేట్ వ‌ర‌ల్డ్‌ది ఈ త‌ప్పు.
పిల్ల‌లు బ‌త‌కాలంటే..
రండి త‌ల్లిదండ్రుల్లారా..
మీరూ, నేను, ఈ స‌మాజం క‌లిసి
ఉరేసుకుందాం.
ఆ త‌ర్వాత క‌ళాశాల‌ల్ని..
ప్ర‌భుత్వాన్నీ ఫ్యాన్ల‌కు ఉరితీద్దాం.
కార్పొరేట్ కాంపిటీష‌న్ భావ‌జాలాన్ని..
ప‌దంత‌స్తుల మీద‌నుంచి తోసేద్దాం.

ఎక్క‌డో ఏదో తప్పుంది..
ఆ త‌ప్పుని స‌రిచేసి ప్ర‌యివేట్ క‌ళాశాల‌ల్ని
స‌ర్జిక‌ల్ స్ర్ట‌యిక్‌తో నోట్ల‌ర‌ద్దులా..
ఒక్క‌రోజులో మూసేస్తారా?
ఈ ప్ర‌భుత్వాలూ అంతే..
ఈ మ‌న‌షులూ అంతే.
(ఓ అమ్మానాన్న‌లారా మీ పిల్ల‌ల్ని ప్రేమ‌గా సాకింది.. చ‌దువుతో చంప‌డానికా?)

 


రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి
21.04.2019

ఫెయిల‌యినందుకు...ఇంట‌ర్మీడియేట్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య అనే వార్త చ‌దివాక నా స్పందన ఇది